ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ విజయం తథ్యమని, దీనిని ఎవరూ ఆపలేరని మాజీ మంత్రి బండారు సత్య నారాయణమూర్తి స్పష్టం చేశారు. బుధవారం సబ్బవరంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ కలయికతో వైసీపీ నాయకులకు బీపీలు పెరిగిపోతున్నాయన్నారు. పవన్‌కల్యాణ్, చంద్రబాబునాయుడు చాలా స్పష్టతతో ఉన్నారని, ఈ కలయికను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెండు పార్టీలు కలిపి 145పైచిలుక సీట్లు సాధించడం ఖాయమన్నారు. తెలుగుదేశం పార్టీ తెచ్చిన సంస్కరణలు, సాధించి ఘనత నేటి యువతకు తెలియజెప్పేందుకే యువనేత లోకేశ్ ‘యువగళం’ పేరిట పాదయాత్ర చేపట్టనున్నారన్నారు. ప్రతిపక్షాల పర్యటనలను అడ్డుకునేందుకు బ్రిటీష్నాటి జీవో తేవడం వైసీపీ పాలకులను తగదన్నారు. టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి భర్నికాన బాబూరావు, టీడీపీ మండల అధ్యక్షుడు మిడతాడ మహాలక్ష్మీనాయుడు, మాజీ అధ్యక్షుడు గండి ముత్యాలనాయుడు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.