తిరుపతి కార్పొరేటర్ల తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి లేఖ రాశారు. తిరుపతి కార్పొరేటర్లు స్టడీ టూర్ పేరుతో ఈనెల 27, 28 తేదీల్లో ఢిల్లీలో జరిగే తిరుపతి కమిషనర్ పెళ్లికి వెళ్లేందుకు సిద్ధమయ్యారని... ఇందుకోసం రూ.25 లక్షలు ఖర్చు చేయాలని స్టాండింగ్ కౌన్సిల్లో ఆమోదించినట్లు తెలుస్తోందన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్లో తిరుపతికి వచ్చినన్ని అవార్డులు, ర్యాంకులు న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు రాకపోవడం గమనార్హమన్నారు. పెళ్లికి వెళ్లేందుకు తిరుపతి కార్పొరేటర్లు ప్రజాధనాన్ని వృధా చేస్తారా అని ప్రశ్నించారు. తక్షణమే దీనిపై స్పందించి తగు చర్యలు చేపట్టాలని రామకృష్ణ లేఖలో డిమాండ్ చేశారు.