ఆర్థిక మాంధ్యం అన్ని బడా కంపెనీల పరిస్థితులను తలకిందులు చేసింది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అమెజాన్ మరోసారి ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. తమ కంపెనీలతో ప్రపంచం వ్యాప్తంగా 18 వేల ఉద్యోగాలను తొలగిస్తామని అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ ఇది వరకే ప్రకటించారు. ఇప్పుడు మరికొంత మందికి ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. ఈ నెల తొలివారంలో దాదాపు 8 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన కంపెనీ ఇప్పుడు మరో 2,300 మంది ఉద్యోగులకు హెచ్చరిక నోటీసును పంపింది. అమెరికా కార్మిక చట్టాల ప్రకారం కంపెనీలో భారీ తొలగింపుల వల్ల ప్రభావితమైన ఉద్యోగులకు 60 రోజుల ముందే దీన్ని తెలియజేయాలి.
అమెరికా, కెనడా, కోస్టారికా దేశాల్లో తమ ఉద్యోగులకు అమెజాన్ నోటీసులు ఇచ్చింది. వాటిని అందుకున్న ఉద్యోగులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఈ రెండో దశ తొలగింపులు మార్చిలో ప్రారంభమవుతాయి. ఉద్యోగం కోల్పోతున్న వారికి అమెజాన్ నిర్ణీత పరిహారం అందించనుంది. కాగా, ఇతర టెక్ కంపెనీల్లో తొలగింపులు కొనసాగుతున్నాయి. దాంతో, చాలా మంది ఉద్యోగుల పరిస్థితి భయంకరంగా మారింది. మైక్రోసాఫ్ట్ ఇటీవల 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గూగుల్, డుంజో, షేర్ చాట్ కూడా లే ఆఫ్ ను ప్రకటించాయి.