ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన స్ప్రింటర్, ఒలింపిక్ వీరుడు ఉసేన్ బోల్ట్ కు అత్యంత దిగ్భ్రాంతికర అనుభవం ఎదురైంది. ఉసేన్ బోల్ట్ ఓ ఇన్వెస్ట్ మెంట్ సంస్థలో పెట్టుబడి ఖాతా కొనసాగిస్తున్నాడు. జమైకాకు చెందిన ఆ సంస్థ పేరు స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్. బోల్ట్... రిటైర్మెంట్, లైఫ్ టైమ్ సేవింగ్స్ కేటగిరీలో ఈ ఖాతాను తెరిచాడు. అయితే ఆ ఖాతా నుంచి అనూహ్యరీతిలో రూ.103 కోట్లు మాయం అయినట్టు ఇటీవల గుర్తించారు.
ఈ ఖాతాలో 12.8 మిలియన్ డాలర్లు ఉండాలి. కానీ కొన్నిరోజుల కిందట చూస్తే కేవలం 12 వేల డాలర్లు మాత్రమే ఉన్నాయి. దీనిపై స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ సంస్థ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసింది. కంపెనీ మాజీ ఉద్యోగి ఈ మోసానికి పాల్పడినట్టు వెల్లడైంది. దాంతో, ఆ డబ్బును తిరిగి ఇచ్చేయాలంటూ బోల్ట్ న్యాయవాదులు ఆ మాజీ ఉద్యోగికి 10 రోజుల గడువు విధించారు. లేకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఉసేన్ బోల్ట్ ఒక్కడి ఖాతాలోనే కాదు, ఇంకా 29 మంది ఖాతాల్లో నగదు మాయమైనట్టు గుర్తించారు. ఈ ఉదంతాన్ని జమైకా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని దేశ ఆర్థికమంత్రి నిగెల్ క్లార్క్ తెలిపారు. అటు, స్టాక్స్ అండ్ సెక్యూరిటీ సంస్థ తన ఖాతాదారుల ఆర్థిక భద్రతను కాపాడడంలో విఫలమైందంటూ, ప్రభుత్వం ఆ సంస్థను తాత్కాలికంగా స్వాధీనం చేసుకుంది.