అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పురపాలక సంఘం పరిధిలోని ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని కలెక్టర్ గిరీష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో జరుగుతున్న రాష్ట్ర అతిథి గృహ నిర్మాణ పనులను గురువారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అతిథి గృహం పక్కనున్న ఖాళీ స్థలాన్ని చదును చేయాలని సూచించారు.
కలెక్టరేట్ ప్రాంగణంలోని మొత్తం ప్రభుత్వ భూమి వివరాలను అందజేయాలని తహసీల్దారు రవిశంకర్ రెడ్డిని ఆదేశించారు. పురపాలక సంఘం ఆదాయం పెంచేందుకు అవసరమైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి పురపాలక శాఖకు అప్పగించాలన్నారు. రహదారులు, జన సమూహ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదేనన్నారు.