రహదారికి భూములు కోల్పోయే రైతు పరిహారంపై అసంతృప్తితో ఆత్మహత్యకు యత్నించాడు. అనంతపురం జిల్లా, ముదిగుబ్బ మండలంలోని కొండగట్టుపల్లిలో అధికారుల సమక్షంలోనే రైతు నరేంద్రబాబు గురువారం విషం తాగేందుకు యత్నించాడు. అక్కడే ఉన్న బంధువులు, పోలీసులు అడ్డుకున్నారు. జిల్లాలోని కోడూరు నుంచి విజయవాడకు గ్రీనఫీల్డ్ హైవే ఏర్పాటుకు కేంద్రం గ్రీనసిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగా సర్వే పనులు చేపట్టారు. తక్కువ పరిహారానికి భూములు ఇవ్వబోమంటూ ముదిగుబ్బ మండలంలోని కొండగట్టుపల్లి, సానేవారిపల్లి, దేవరగుడిపల్లి, మలకవేముల గ్రామాల రైతులు.. సర్వేను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ధర్మవరం ఆర్డీఓ తిప్పేనాయక్ కొండగట్టుపల్లికి చేరుకుని, రైతులతో చర్చించారు. గ్రామంలో రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. ప్రస్తుతం భూముల ధరలు అధికంగా ఉన్నాయనీ, ప్రభుత్వం మాత్రం పరిహారం తక్కువగా చెల్లిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భూములను రహదారికి తక్కువ ధరకు తీసుకుంటే తాము ఎలా బతకాలని వాపోయారు. ఈ నేపథ్యంలో ఆర్డీఓ ఎదుటే రైతు నరేంద్రబాబు పురుగు మందు తాగేందుకు యత్నించాడు. అక్కడే ఉన్న బంధువులు, పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారానికి అదనంగా 25 శాతం చెల్లించేలా ఏర్పాటు చేస్తామని రైతులకు ఆర్డీఓ తెలిపారు. అందుకు రైతులు అంగీకరించారు. ఆ మేరకు సర్వేకి సహకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa