శ్రీకాకుళం జిల్లా, ఉద్దానం ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న కిడ్నీ వ్యాధిని నిర్మూలిద్దామని, దీనికోసం ప్రభుత్వం, సామాజిక, స్వచ్ఛంద సేవా సంస్థలతో పాటు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కోర్టు చాంబర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్దానం ప్రజలంతా విధిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీనివల్ల కిడ్నీ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి మరణాలను నివారించవచ్చునని చెప్పారు. జిల్లా న్యాయస్థానం ఆధ్వర్యంలో విజ్ఞాన సదస్సులు నిర్వహించి ఉద్దానం వాసులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇప్పటివరకు నాలుగు మండలాల్లో మూడు వైద్య శిబిరాలు, మూడు న్యాయ సదస్సులు నిర్వహించినట్లు చెప్పారు. ఫిబ్రవరి 11న నిర్వహించనున్న మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు వినియోగించుకోవాలని కోరారు. లోక్‌అదాలత్‌కు ఎక్కువగా క్రిమినల్ కేసులే వస్తున్నాయని, సివిల్ కేసులు కూడా వచ్చేలా చూడాలని న్యాయవాదులకు సూచించారు. అనంతరం కలెక్టరేట్ సమీపంలోని బెహరా మనోవికాస కేంద్రాన్ని ఆయన సందర్శించారు. కేంద్రంలోని సేవలు, సౌకర్యాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి న్యాయ సహాయం అవసరమైనా న్యాయసేవాధికార సంస్థకు తెలియజేస్తే ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, బెహరా మనోవికాస కేంద్రం నిర్వాహకులు శేఖర్, శ్యామల, న్యాయవాది ఇందిరాప్రసాద్ పాల్గొన్నారు.