‘టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారంటే మీకెందుకంత గుండె దడ. ఆయన రోడ్డుమీది కొస్తే మీరు ఇంటికెళ్లక తప్పదన్న భయమా? ఆ భయంతో అడ్డుకోవడానికి ఇన్ని కుట్రలు చేస్తున్నారా? అయినా భయపడేది లేదు. యువగళం పేరుతో లోకేశ్ కుప్పంనుంచి ప్రారంభిస్తున్న పాదయాత్రను సక్సెస్ చేసి తీరుతాం’ అని మాజీ మంత్రి అమరనాథ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యులతో కలిసి ఆదివారం ఆయన కుప్పంలో లోకేశ్ పాల్గొననున్న బహిరంగ సభావేదికను పరిశీలించారు. వారితో కలిసి అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. లోకేశ్ పాదయాత్రను అడ్డుకోవడానికి సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. సీఎం జగన్ కనుసన్నల్లో అఽధికార యంత్రాంగం, పోలీసు వ్యవస్థ మొత్తం అనుమతులివ్వడానికి కొర్రీలు పెడుతూ మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. చట్టానికి లోబడి తాము పాదయాత్ర ఏర్పాట్లు చేసుకుంటుంటున్నా అనుమతిలివ్వడానికి అధికారులు తిరకాసు పెట్టడం దారుణమన్నారు. అసలు రోడ్డుమీద నడచుకుంటూ పోవడానికి పర్మిషన్ అవసరమేమిటని నిలదీశారు. నాడు జగన్, ఆయన తండ్రి వైఎస్ టీడీపీ హయాంలోనే పాదయాత్రలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పుడు చంద్రబాబు వారి యాత్రలను అడ్డుకుని ఉంటే ఏం చేయగలిగి ఉండేవారని ప్రశ్నించారు. ప్రతిపక్షాల హక్కులను, వాక్ స్వాతంత్ర్యాన్ని అణచివేసే హక్కు మీకెవరిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మీరు, మీ మంత్రులు, ఎమ్మెల్యేలు నడిరోడ్డుపైనే సభలు, సమావేశాలు పెడుతున్నారు. మేము ప్రైవేటు స్థలంలో లోకేశ్ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. దీనికి కూడా పర్మిషన్ ఎందుకివ్వరు? ఏ చట్టం అలా చెప్పింది?’ అని నిలదీశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయకపోయినా, తమ పార్టీ కార్యకర్తలే అండగా ఉండి లోకేశ్ పాదయాత్రను దిగ్విజయం చేస్తారన్నారు. అధికారులు అనుమతులివ్వకుంటే న్యాయపోరాటం చేయడం అనివార్యమన్నారు.