మద్యానికి బానిసైన తండ్రిని సాధారణ మనిషిగా మర్చాలని ఆ కుమార్తె భావించింది. తల్లి విసిగివెళ్లిపోయినా తాను మాత్రం తండ్రి చెంతే ఉంది. మందు మానేయాలని ప్రాధేయపడింది. ఎంతైనా మారకపోవడంతో నాన్న ఏమైపోతాడోనని భయపడింది. చివరకు అదే బాధతో తాను ఆత్మహత్య చేసుకుంది. విజయనగరం జిల్లా, పరిధిలోని జీకేఆర్‌పురం గ్రామానికి చెందిన ముద్దాడ స్రవంతి (15) విషాదాంతమిది. వివరాల్లోకి వెళ్ళితే... . జీకేఆర్ పురం గ్రామానికి చెందిన ముద్దాడ స్రవంతి (15) స్థానిక కస్తూర్బా గాంధీ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. బాలిక తండ్రి మద్యానికి బానిసై భార్యతో రోజూ గొడవపడుతుండేవాడు. దీనిని సహించలేక ఆమె కుమారుడ్ని తీసుకొని తన కన్నవారి ఇంటికి వెళ్లిపోయింది. కుమార్తె స్రవంతి మాత్రం తండ్రి దగ్గర ఉంటానని చెప్పి ఉండిపోయింది. తండ్రి తాగుడు అలవాటును మార్చాలని చాలాసార్లు ప్రయత్నించింది. ఇక విసిగిపోయి ఈ నెల 18న ఇంట్లో ఉన్న చీమల మందును నీటిలో కలిపి తాగింది. వెంటనే ఆమెను బాడంగి సీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందింది. బాలిక తల్లి ముద్దాడ పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్‌సీ ఉమామహేశ్వరరావు తెలిపారు.