టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర అడ్డుకోవాలని ప్రభుత్వం చూస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ లోకేష్ పాదయాత్ర కోసం 20 రోజుల క్రితం అనుమతి అడిగితే ఇంకా ఇవ్వలేదని, రాష్ట్ర డీజీపీ తీరు ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. లోకేష్ ఎవరిని కలిసేది, ఎక్కడ బస చేసేది చెప్పాలా?... దీని వెనుక కుట్ర దాగి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.వైసీపీకి వంత పాడుతున్న పోలీసు అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని నక్కా ఆనంద్ బాబు హెచ్చరించారు. ప్రజాస్వామ్యయుతంగా పోలీసులు పని చేయాలని సూచించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో రాష్ట్రంలో యువతను సీఎం జగన్ మోసం చేశారని ఆరోపించారు. యువతను మత్తులో ముంచి ప్రశ్నించకుండా చేస్తున్నారని, ప్రజలు తిరుగుబాటు చేసే సమయం వచ్చిందన్నారు. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లకుండా చేసేందుకు జీవో 1 తెచ్చారన్నారు. కందుకూరు, గుంటూరు తొక్కిసలాటకు ప్రభుత్వమే కారణమని, ఆ సాకుతో టీడీపీ కార్యక్రమాలు అడ్డుకోవాలని చూస్తున్నారని నక్కా ఆనంద్ బాబు వ్యాఖ్యానించారు.