ఎవరూ చూడరు కదా అని మనం ఇంట్లో ఎంత పడితే అంత డబ్బు దాచుకొంటే మాత్రం కష్టాలు తప్పవు. ఇదిలావుంటే ఇటీవలి కాలంలో ఆదాయపు పన్ను శాఖ పెద్ద ఎత్తున రైడ్స్ చేస్తోంది. అయితే ఇవి ఎక్కువగా రాజకీయ నాయకులు, సెలబ్రిటీల ఇళ్లలోనే చేస్తుంటుంది. ఆ సమయంలో లెక్కకు మించి డబ్బుంటే.. లెక్కలు సరిపోలకుంటే ఆ డబ్బును సీజ్ చేస్తుంటుంది. అయితే.. ఈ నేపథ్యంలో సగటు మనిషికి ఒక సందేహం వస్తుంది? అసలు ఇంట్లో ఎక్కువగా డబ్బులు నిల్వ ఉంచుకోకూడదా? ఎంత వరకు ఉంటే సమస్య ఉండదు? ఐటీ శాఖ రైడ్స్ చేస్తే.. ఏం చెప్పాలి? డబ్బును ఎలా కాపాడుకోవాలి? అని ఎన్నో ప్రశ్నలు మదిలో మెదులుతున్నాయి. భారత్‌లో ప్రజలు సాధారణంగా ఇళ్లలో డబ్బులు దాచుకోవడం కామన్. పాతకాలం నుంచి ఇది సంప్రదాయంగా వస్తోంది. కొందరు బ్యాంకుల్లో దాచుకోవడం, ఇన్వెస్ట్‌మెంట్లు చేయడం చేస్తుంటారు. అయితే పల్లెటూర్లలో, అలాగే నగరాల్లో బ్లాక్ మనీ వంటిది ఉంటే.. ఇళ్లలోనే సురక్షితంగా దాచుకుంటుంటారు.
డబ్బును దాచుకునేందుకు బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ కంపెనీలు ఎన్నో ఫెసిలిటీలు తీసుకొచ్చినప్పటికీ ప్రజలు తమ దగ్గర కచ్చితంగా డబ్బును ఉంచుకుంటారు. ఏదైనా అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందనో, ఇంకేదైనా కావొచ్చు.. ఇప్పటికీ డబ్బులు ఇంట్లో ఎక్కువ మొత్తంలో దాచుకునేవారిని మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇంట్లో ఎంత వరకు నగదు నిల్వ చేసుకోవచ్చు? ఇంట్లో ఎంత ఉందో మీరు ఆదాయపు పన్ను శాఖకు చెప్పాల్సి ఉంటుందా? అంటే సరైన సమాధానం లేదు.
అయితే ఇంట్లో ఎంత వరకైనా నగదు నిల్వ చేసుకోవచ్చు. ఇంతవరకే ఉండాలనే నిబంధన ఏం లేదు. ఆదాయపు పన్ను శాఖ కూడా కచ్చితంగా దీని గురించి ఏం చెప్పదు. అయితే మీ ఇంట్లో ఎంత డబ్బు ఉందో, అది ఎక్కడినుంచి వచ్చిందో, దాని గురించి సరైన సమాచారం మీ దగ్గర ఉండాలి. సంబంధిత పత్రాలు కూడా ఉంటే ఇంకా మంచిది. అప్పుడే ఎలాంటి చిక్కులు ఉండవు. ఉదాహరణకు వ్యవసాయం నుంచి వస్తే ఆ బిల్లు, ఏదైనా బిజినెస్‌లో వస్తే దానికి సంబంధించిన పత్రాలు వంటివి ఉండాలి. ఏదైనా సమయంలో ఐటీ శాఖ దాడులు జరిపిన సమయంలో వారు కచ్చితంగా సంబంధిత డాక్యుమెంట్లు అడుగుతారు. ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందే. అయితే మీ దగ్గర సరైన సమాచారం లేకుంటే గనుక.. ఆ డబ్బును ఐటీ శాఖ కచ్చితంగా సీజ్ చేస్తుంది. అందుకే ముందు జాగ్రత్త అత్యవసరం.
మీ దగ్గర ఎంత డబ్బులున్నాయో? మీ ఆదాయం ఎంతో? దానికి అనుగుణంగా.. మీ ఇంట్లో ఉన్న నగదు పన్ను పరిధిలోకి వస్తే దానికి పన్ను కట్టాల్సిందే. పన్ను చెల్లించకపోయినప్పటికీ.. పన్ను ఎగవేత కింద మీపై కేసు నమోదు చేసి.. నగదును సీజ్ చేసే అవకాశాలు ఉంటాయి. మీ దగ్గర ఉన్న డబ్బుకు మీ దగ్గర సరైన సమాచారం లేకుంటే, సరైన పత్రాలు లేకుంటే మాత్రం మీరు కచ్చితంగా చిక్కుల్లో పడతారు. అప్పుడే కేవలం ఐటీ శాఖ మాత్రమే కాదు.. ఈడీ, సీబీఐ కూడా ప్రశ్నించే అవకాశాలు ఉంటాయి. అన్ని పత్రాలు సరిగ్గా ఉంటే మాత్రం ఏ ఇబ్బందీ ఉండదు. మీ దగ్గర లెక్కకు మించిన డబ్బు ఉన్న సమయంలో ఆ డబ్బు సీజ్ చేయడమే కాకుండా.. దానిపై అదనంగా మరో 37 శాతం వరకు జరిమానా పడుతుంది. అందుకే డబ్బును వీలైనంత తక్కువగానే ఇంట్లో ఉంచుకోవడం మంచిది. బ్యాంకుల్లో డబ్బు దాచుకోవడం సురక్షితం.