తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పేరుతో చేయనున్న పాదయాత్రకు 15 అసంబద్ద, అప్రజాస్వామిక షరతులు పెట్టి, పాదయాత్రకు పోలీసులు రక్షణ కల్పిస్తామన్న అంశం లేకుండా మూడు రోజులకు మాత్రమే అనుమతిస్తూ పోలీసులు ఉత్తర్వులు ఇవ్వటాన్ని రాష్ట్ర పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా తప్పు పట్టారు. బుధవారం భట్టిప్రోలు లో విలేఖర్లతో ఆయన మాట్లాడుచూ జనవరి 27 నుండి లోకేష్ చేయనున్న పాదయాత్రకు పోలీసులు ఇచ్చిన అనుమతిని పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భయాందోళనలో ఉన్నట్లు తేటతెల్లమౌతున్నదన్నారు.
మున్సిపాలిటీ రోడ్స్, పంచాయతీ రోడ్స్ మీద మీటింగులు పెట్టకూడదని, పరిమిత వాహనాలను మాత్రమే ఉపయోగించాలని, సౌండ్ బాక్స్ లు పెట్టకూడదని, టపాసులు పేల్చకూడదని, మారణాయుధాలు కలిగివుండ కూడదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అనుమతులు రద్దు చేస్తామనటం వెనుక ప్రభుత్వ కుట్ర దాగివున్నదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ అసమర్ధ పరిపాలనకు వ్యతిరేకంగా, ప్రజలు అసంతృప్తితో వుండి చంద్రబాబు సభలకు జనం పోటేత్తుతున్నారని, లోకేష్ పాదయాత్రకు కూడా ప్రజలు ముఖ్యంగా యువత బ్రహ్మరధం పట్టటానికి సిద్ధంగా వున్నారని, అది గమనించిన జగన్ రెడ్డి అభద్రతాభావంలో ఉన్నాడని అన్నారు.
ఫలితంగానే లోకేష్ పాదయాత్రకు పోలీసులతో ఈ విధమైన అప్రజాస్వామిక అనుమతి ఉత్తర్వులు ఇప్పించటమే జగన్ భయానికి నిదర్శనమని అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రకు కేవలం 3 నిబంధనలతో ప్రశాంతంగా పాదయాత్ర చేసుకోమని, తగిన బందోబస్తు కల్పిస్తూ చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర వ్యాపిత అనుమతిస్తే, నేడు జగన్ రెడ్డి ప్రభుత్వ ఇచ్చిన మూడు రోజుల అనుమతిలోని షరతుల అంతరార్ధాన్ని ప్రజలు అర్ధం చేసుకోవాలని, అధికార పార్టీ నేతలే అక్రమాలు సృష్టించి, పాదయాత్రకు ఆటంకాలు, అడ్డంకులు సృష్టించే మోసం దాగున్నదని అనుమానాన్ని వెలిబుచ్చారు. అధికార పార్టీ నేతలు చేస్తున్న ఊరేగింపులకు, యాత్రలకు ఈ షరతులు వర్తించవా అంటూ ఆయన విమర్శించారు.
గడప గడపకు పేరుతో అధికార పార్టీ నేతలు చేస్తున్న యాత్రలకు షరతులు వర్తించవా అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వపు దుర్మార్గపు ఆలోచనను తెలుగుదేశం శ్రేణులు, రాష్ట్ర ప్రజలు అర్ధంచేసుకొని, లోకేష్ పాదయాత్రకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేసారు. సమావేశంలో తెలుగుదేశం నాయకులు కుక్కల వెంకటేశరరావు, శొంఠి సుబ్బారావు, వేములపల్లి శివకుమార్, వేములపల్లి కమలాకర రావు, నక్కా శ్రీనివాసరావు, బొర్రా గాంధీ, వాకా శ్రీనివాసరావు, మాచర్ల నాగరాజు, వేజెండ్ల సతీష్, రాజులపాటి వెంకటేశ్వరరావు, నాగబాబు, రాచూరు పాములు, యరగళ్ల సాంబశివరావు, కంభం సుధీర్, ఈడే శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.