పవన్ కళ్యాణ్ వారాహితో పాటు తాజా ఆంధ్రప్రదేశ్‌లో మరో వారాహి కూడా పరుగులు తీస్తోంది. దానికి సంబంధించి వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లి కి చెందిన పొట్టుపోతు దొరబాబు పవన్‌కళ్యాణ్ వీరాభిమాని. జనసేన పార్టీలోనూ క్రియాశీలకంగా పనిచేస్తుంటాడు. ఆ అభిమానంతోనే పవన్ కళ్యాణ్ ప్రచార రథమైన వారాహి రంగులోనే తాను ఎలక్ట్రికల్ బైక్ కొన్నాడు. దానిపై వారాహి అంటూ స్టిక్కర్ కూడా అతికించి అమలాపురం రోడ్లపై తిరుగుతున్నాడు. పవన్ వారాహి వాహనంపై ప్రచారం చేస్తే తాను బైక్‌తో ప్రచారం చేస్తానంటున్నాడు దొరబాబు.
వారాహి వాహనాన్ని ఏపీ రోడ్లపై తిరగనివ్వబోమని వైసీపీ నేతలు చేసిన హెచ్చరికలు తనను రెచ్చగొట్టాయని.. అందుకే అదే కలర్‌లో తాను ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేశానని దొరబాబు చెబుతున్నాడు. ప్రత్యేకమైన రంగు కావడంతో బైక్ కొనుగోలుకు లక్షా 60వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చిందని తెలిపాడు. ఈ బైక్‌తో తాను జనసేన తరపున ప్రచారం చేస్తానని.. ఎవరికైనా దమ్ముంటే ఆపాలని దొరబాబు సవాల్ చేస్తున్నాడు. ఈ వారాహి బైక్ మాత్రం జనసైనికులను తెగ ఆకట్టుకుంటోంది.
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ప్రచార రథం ‘వారాహి’పై కొంతకాలంగా ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ వాహనం డిజైన్ దగ్గర నుంచి రంగు వరకు అధికార పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు అన్నీఇన్నీ కావు. ‘వారాహి’కి మిలటరీ రంగు వేశారని.. ఏపీ రోడ్లపై తిరగనివ్వబోమంటూ పలువురు మంత్రులు బాహాటంగానే ప్రకటించారు. అయితే ఈ వాహనానికి తెలంగాణ రవాణా శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేయడంతో జనసైనికులు పండగ చేసుకున్నారు.
సకల వసతులతో దుర్భేద్యంగా తయారైన ఈ వాహనానికి మంగళవారం కొండగట్టు అంజన్న ఆలయంలో, బుధవారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పవన్‌కళ్యాణ్ పూజలు నిర్వహించారు. ఈ క్రమంలోనే వారాహిని అడ్డుకుంటామని ప్రగల్భాలు పలికిన వైసీపీ నేతలు ఎక్కడంటూ జన సైనికులు సోషల్‌మీడియాలో కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పుడు అమలాపురంలో వారాహి (Amalapuram Varahi) కూడా వైరల్ అవుతోంది. అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అనేది ఇందుకేనేమో..