కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్.. అసమర్థుడని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు.. చందాలిచ్చిన వారి కోసం తప్ప.. లోకేష్ పాదయాత్ర దేనికి పనికిరాదని సెటైర్లు వేశారు. లోకేష్ ఏం సాధించారని.. ఏ హోదాలో పాదయాత్ర చేస్తున్నారు? అని కొడాలి నాని ప్రశ్నించారు. పోటీ చేసిన చోట ఓడిపోయిన పప్పు సుద్ద లోకేష్ అని.. అలాంటి లోకేష్ పాదయాత్రతో టీడీపీ అధికారంలోకి వచ్చే సీనుందా? అని నాని ప్రశ్నించారు.
'లోకేష్ ఏ హోదాలో పాదయాత్ర చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తి పాదయాత్ర చేస్తే.. ఏం లాభం. ప్రజలకు లోకేష్ ఏం చెప్తారు. జగన్ ఒక ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేశారు. సక్సెస్ అయ్యారు. మూడేళ్లు, మూడు శాఖలకు మంత్రిగా పనిచేసినా.. లోకేష్‌ను మంగళగిరి ప్రజలు ఓడించారు. లోకేష్ పాదయాత్ర వల్ల టీడీపీకి, చంద్రబాబుకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇలాంటి వారు వచ్చి యాత్రలు చేస్తే.. వైఎస్సార్సీపీ గెలుపు ఇక నల్లేరు మీద నడకే' అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
'ఎన్టీఆర్ చెమట, రక్తంతో ఏర్పడిన పార్టీ తెలుగుదేశం. అలాంటి పార్టీని లాగేసుకునేందుకు లోకేష్‌తో పాదయాత్ర చేయిస్తున్నారు. నందమూరి కుటుబంలో ఎన్టీఆర్ వారసులు మంచి స్థాయిలో ఉన్నారు. వారు మళ్లీ పార్టీని లాగేసుకుంటారని భయపడి.. లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. కానీ.. అది సక్సెస్ కాదు. లోకేష్ 2024 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే అవ్వరు. చంద్రబాబుకు వయస్సు అయిపోతది. అప్పుడు నందమూరి వారసులు టీడీపీని హస్తగతం చేసుకుంటారు' అని కొడాలి నాని స్పష్టం చేశారు.