సంతోషంగా ఓ పెళ్లి వేడుక సాగుతోంది..మరోవైపు బంధువులు, స్నేహితులతో కళకళలాడుతోంది. అందరూ భోజనాలు చేస్తున్నారు.. ఇంతలో ఏదో అలజడిరేగింది. ఒక్కసారిగా అక్కడున్నవారంతా బయటకు పరుగులు తీయగా.. ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. భోజనాలు చేస్తున్న హాలులో ఫ్లోరింగ్‌పై టైల్స్ పగలడంతో అందరూ భయంతో పరుగులు పెట్టారు.
విశాఖ జిల్లా చినముషిడివాడకు చెందిన చిరంజీవి, మౌనికల పెళ్లి వేడుక స్థానికంగా ఉన్న దాట్ల మేన్షన్‌లో ఘనంగా జరుగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున 5.15 గంటలకు ముహూర్తం కాగా.. గురువారం రాత్రి 9 గంటలకు కళ్యాణ మండపం ఫస్ట్ ఫ్లోర్‌లో అందరూ భోజనాలు చేస్తున్నారు. ఇంతలో ఏమైందో, ఏమో ఒక్కసారిగా నేలపై ఉన్న టైల్స్ పగిలిపోయి ఎగిరిపడ్డాయి. ఏం జరుగుతుందో అర్థంకాక.. వధూవరులు, కుటుంబసభ్యులు, బంధువులు మండపం నుంచి బయటకు పరుగులు తీశారు.
వెంటనే వారంతా పెందుర్తి పోలీసులకు, మండపం సిబ్బందికి సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు, సిబ్బంది వెళ్లి చూడగా.. ఫ్లోర్ టైల్స్ పగిలిపోయి ఉన్నాయి. ఆ భవనంలో మొత్తం నాలుగు ఫ్లోర్లు ఉంటే.. మొదటి అంతస్తులో మాత్రమే పగుళ్లు ఏర్పడ్డాయి. ఇలా ఎందుకు జరిగిందని అర్థంకాక తలలు పట్టుకున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ పెళ్లిని చినముషిడివాడ శారదాపీఠం పక్కనున్న పోర్టు కళ్యాణ మండపంలో చేయడానికి 45 రోజుల క్రితం బుక్ చేశామని వధువు సోదరి తెలిపారు. కానీ శారదాపీఠం వార్షికోత్సవాల్లో భాగంగా సీఎం జగన్, గవర్నర్లు వస్తున్నారన్న కారణంగా హఠాత్తుగా కళ్యాణ మండపం ఇవ్వలేమని నిర్వాహకులు తెలపడంతో అప్పటికప్పుడు దాట్ల కల్యాణ మండపంలో బుక్ చేసుకున్నట్లు చెప్పారు.