బ్యాంకుల సమ్మె ప్రతిపాదనను ప్రస్తుతానికి విరమించుకున్నారు. దీంతో శుక్రవారం మినహా వరుసగా ఐదు రోజులు బ్యాంకులు పనిచేయడం లేదని గత పది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఎట్టకేలకు తెరపడింది. గురువారం గణతంత్ర దినోత్సవం, నాలుగవ శనివారం, ఆదివారాల కారణంగా బ్యాంకులకు సాధారణ సెలవులు వచ్చాయి. ఇక సోమ, మంగళవారాల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు సమ్మె ప్రకటించాయి. షెడ్యూలు బ్యాంకులతో సహా కార్పొరేట్ బ్యాంకులు సైతం ఈ సమ్మెలో పాల్గొనేందుకు నిర్ణయించాయి. దీంతో శుక్రవారం తప్పించి ఐదు రోజులు వరుసగా బ్యాంకులు పనిచేయడం లేదని బ్యాంకింగ్ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. అయితే శుక్రవారం సాయంత్రం వరకు కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు బ్యాంకింగ్ సంఘాల్లో సుదీర్ఘంగా జరిపిన చర్చల ఫలితంగా సాయంత్రానికి సమ్మె ప్రతిపాదన విరమించుకున్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. ఫలితంగా సోమ, మంగళవారాల్లో కూడా అన్ని బ్యాంకులు యథాతథంగా పనిచేస్తాయని పేర్కొన్నారు.