ముందు వెళుతున్న లారీని ఓవర్టేక్ చేసే సమయంలో ఓ ట్రావెల్స్ బస్సు లారీ వెనుకవైపు బలంగా ఢీ కొంది. దీంతో బస్సు క్లీనర్ జన్నవోగు సుబ్బయ్య (20) అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున ప్రకాశం జిల్లా, కందులాపురం పంచాయతీ పరిధిలో రైల్వే ఓవర్ బ్రిడ్జిపై జరిగింది. కంభం ఎస్సై నాగమల్లేశ్వరరావు కథనం ప్రకారం.. భీమవరం నుంచి పొద్దుటూరుకు ఎరువు మట్టి లోడుతో లారీ వెళుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి పై నుంచి వస్తోంది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి గిద్దలూరు వెళుతున్న ట్రావెల్స్ బస్సు ముందు వెళుతున్న లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేసింది. అదే సమయంలో మంచు బాగా కురుస్తోంది. దీంతో బస్సు డ్రైవర్‌కు లారీ వెనుక భాగం సరిగా కనిపించలేదు. దీంతో లారీని బస్సు బలంగా ఢీకొట్టింది. డ్రైవర్ పక్కన కూర్చున్న క్లీనర్ జన్నబోగు సుబ్బయ్య క్యాబిన్లో ఇరుక్కుపోయి అక్కడిక్కడే మృతిచెందాడు. ఆయన స్వగ్రామం మార్కాపురం మండలం చింతకుంట. ఆ సమయంలో బస్సులో ఆరుగురు ప్రయాణికులున్నారు. వారు క్షేమంగానే బయటపడ్డారు. ఓవర్‌బ్రిడ్జిపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో క్లీయర్ చే సి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.