గంజాయి, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ బోల్డ్స్, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలతో పాటు మత్తు కలిగించే ఇంజక్షన్ల వినియోగం విశాఖ నగరంలో భారీగా పెరుగుతోంది. ఇవి ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బిహార్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, తదితర 18 రాష్ట్రాల నుంచి మత్తు కలిగించే ఇంజక్షన్లు, డ్రగ్స్ నగరానికి దిగుమతి అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రత్యేక పరిస్థితుల్లో వైద్యుల సూచన మేరకు మాత్రమే వినియోగించాల్సిన ఈ మత్తు మందులను కొంతమంది నగరానికి తెప్పిస్తున్నారు. ఇక్కడ ఏజెంట్ల ద్వారా రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుండడంతో నగరంలో పలువురు వీటి విక్రయంపై దృష్టిపెట్టారు. యువత సరదాగా మొదలెట్టి క్రమేణా వాటికి బానిసలవుతున్నారు.