తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయండని టీడీపీ జిల్లా అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గం ఇంచార్జ్ బి. కె. పార్థసారథి కి టీడిపి అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఇంచార్జిలతో వన్ టూ వన్ కార్యక్రమంలో భాగంగా శనివారం విజయవాడలోని చంద్రబాబు నివాసంలో పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బి. కె. పార్థసారథి సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా రానున్న ఎన్నికల్లో పెనుకొండ కోట పై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడానికి అన్ని విధాల సమాయత్తం కావాలని పార్థసారథి కి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో చేపడుతున్న పార్టీ కార్యక్రమాలను బి. కె. పార్థసారథి చంద్రబాబు కు అంశాల వారీగా వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో వస్తున్న స్పందనకు సంబందించిన అంశాలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కు వివరించారు. రానున్న ఎన్నికల సమయం చాలా కీలకమైనదని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు కార్యకర్తలను సంసిద్ధం చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. నియోజకవర్గంలో మరింతగా ప్రజల్లోకి వెళ్లి వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడాలని పార్థుడికి సూచించారు. ఎన్నికల సమరం ఉందనే విధంగా గ్రామాల్లో ప్రజల సమస్యలపై దృష్టి సారించి పోరాటం చేయాలని చంద్రబాబు పార్థసారథికి సూచించారు.