ఆగమశాస్త్ర నియమాలు పాటించడం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. టీటీడీ అధికారుల తీరుపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో ఆగమ నియమాలను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపించారు. తిరుమలలో ఆగమశాస్త్ర నియమాలు పాటించడం లేదని.. శాస్త్ర నియమాలకు విరుద్ధంగా పని చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. సొంత ప్రణాళిక ప్రకారమే అధికారులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుమలలో ధనికులైన భక్తులకే అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారని.. రమణ దీక్షితులు ఆరోపించారు. వీఐపీల సేవలో అధికారులు తరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. గతంలోనూ ఆయన పలు ఆరోపణలు చేశారు. శ్రీవారి ఆలయంలో వివిధ కులాలకు చెందిన 54 కుటుంబాలు వంశపార్యపరంగా సేవలు చేస్తున్నాయని గుర్తు చేశారు. కానీ.. 30/87 యాక్ట్‌తో వీరిని తొలగించారని.. తిరుమలలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.