సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తారకతర్న ఆరోగ్యపరిస్థితిపై కర్ణాటక ప్రభుత్వం కూడా ఆరా తీస్తోంది. ఇదిలావుంటే నందమూరి తారకరత్న గుండెపోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు హాస్పిటల్‌కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వస్తున్నారు. బెంగళూరులోని తెలుగువారితో పాటు టీడీపీ శ్రేణులు తరలివస్తున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద కర్ణాటక పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. తారకతర్న ఆరోగ్యపరిస్థితిపై కర్ణాటక ప్రభుత్వం కూడా ఆరా తీస్తోంది.
కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఆదేశాలతో ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ నారాయణ హృదయాలయకు వచ్చారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యం అందిస్తున్న ప్రత్యేక డాక్టర్లు బృందం, కుటుంసభ్యులతో ఆయన మాట్లాడారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు. తారకరత్న కోలుకుని తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు సుధాకర్ స్పష్టం చేశారు. ఆస్పత్రి నుంచి బయటకొస్తూ సుధాకర్ మీడియాతో మాట్లాడారు.
నిన్నటితో పోలిస్తే తారకరత్న ఆరోగ్యం ఇవాళ కాస్త మెరుగుపడిందని సుధాకర్ తెలిపారు. డాక్టర్లు చికిత్స అందిస్తున్నారని, కర్ణాటక ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. సీఎం బసవరాజ్ బొమ్మై తారకరత్న ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని, ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని అన్నారు. తారకరత్నకు డాక్టర్లు చికిత్స స్పందిస్తున్నారని చెప్పారు. కుప్పం నుంచి బెంగళూరుకు తీసుకొచ్చేందుకు గ్రీన్ ఛానెల్ కూడా ఏర్పాటు చేసినట్లు సుధాకర్ పేర్కొన్నారు. నిమ్హాన్స్ నుంచి తాము స్పెషలిస్ట్ డాక్టర్లను కూడా పిలిపించామని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని సహయసహకరాలు అందిస్తుందని సుధాకర్ స్పష్టం చేశారు. ఆయనకు మంచి ట్రీట్‌మెంట్ అందేలా సహకరిస్తామన్నారు.
తారకరత్న త్వరగా కోలుకుని తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ మీడియాతో మాట్లాడే సమయంలో ఆయన పక్కన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఉన్నారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరు వెళ్లిన ఎన్టీఆర్‌కు మంత్రి స్వాగతం పలికారు. ఎన్టీఆర్‌తో పాటు కల్యాణ్ రామ్, భార్య ప్రణతి కూడా బెంగళూరు వెళ్లారు. అలాగే నారా బ్రహ్మణి, ఇతర కుటుంబసభ్యులు కూడా బెంగళూరుకు ఇవాళ ఉదయం చేరుకున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న తారకరత్నను చూసిన కుటుంబసభ్యులు.. ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. దాదాపు నందమూరి, నారా కుటుంబసభ్యులందరూ ఆస్పత్రిలోనే ఉన్నారు. దగ్గరుండి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారని, ఇవాళ ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని బాలయ్య, ఎన్టీఆర్ తెలిపారు. తారకరత్న ఎక్మోపై లేరని, ఆరోగ్యం నిలకడగా ఉందని మీడియాకు వెల్లడించారు. తాము ఐసీయూలోకి వెళ్లి కదిలించే ప్రయత్నం చేశామని, స్పందిస్తున్నారని అన్నారు.