మార్కెట్ లోకి ఎలక్ట్రికల్ వెహికల్ తాకిడి పెరుగుతోంది. తాజాగా టీవీఎస్ మోటార్ కంపెనీ ఐక్యూబ్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ తో మార్కెట్లో దూసుకుపోతోంది. అధికంగా విక్రయమయ్యే టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఐక్యూబ్ కూడా చేరిపోయింది. దీంతో మరిన్ని ఎలక్ట్రిక్ టూవీలర్లతో ఈ మార్కెట్లో గట్టి పట్టు సాధించాలనే ప్రణాళికలతో టీవీఎస్ మోటార్ కంపెనీ ఉంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో కేఎన్ రాధాకృష్ణన్ వాటాదారులతో పంచుకున్నారు.
5 కిలోవాట్ నుంచి 25 కిలోవాట్ పవర్ మధ్య నూతన ఎలక్ట్రిక్ టూవీలర్ మోడళ్లను తీసుకురానున్నట్టు చెప్పారు. ప్రీమియం ఎలక్ట్రిక్ టూవీలర్ల విభాగంలోకి సైతం అడుగు పెట్టనున్నట్టు తెలిపారు. ఎలక్ట్రిక్ బైక్ కూడా రానున్నట్టు చెప్పారు. టీవీఎస్ ఐక్యూబ్ 4.4 కిలోవాటర్ మోటార్ తో ఉండగా, కొత్తగా తీసుకొచ్చే ఎలక్ట్రిక్ టూవీలర్లు ఇంతకంటే అధిక సామర్థ్యంతో ఉంటాయని రాధాకృష్ణన్ తెలిపారు.
కొత్తగా తీసుకొచ్చే ఎలక్ట్రిక్ టూవీలర్ల స్పెసికేషన్లను చెప్పకుండా, అవి తప్పకుండా వినియోగదారులను ఆకర్షిస్తాయని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఐక్యూబ్ ఫిక్స్ డ్ బ్యాటరీతో వస్తోంది. అంటే బ్యాటరీ తీసి చార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం లేదు. భవిష్యత్తులో తీసుకొచ్చే వాటిల్లో రిమూవబుల్, స్వాపబుల్ బ్యాటరీ ఆప్షన్లను తోసిపుచ్చలేమన్నారు. ఐక్యూబ్ విక్రయాలు ఇకముందూ బలంగానే ఉంటాయన్న అంచనా వ్యక్తం చేశారు.