పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విషాదం చోటు చేసుకొంది. కలుషిత ఆహారం తిని 150 మందికి అస్వస్థతకు గురయ్యారు. మండలంలోనిి రామకృష్ణాపురంలోని అంబేడ్కర్ బాలికల గురుకుల విద్యాలయంలో.. సుమారు 150 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం కలుషిత అల్పాహారం తీసుకోవడం వల్ల.. 30 మంది వరకు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారని చెబుతున్నారు. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం చేశాక మరికొందరు వాంతులతో అస్వస్థతకు గురవడంతో.. పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు అప్రమత్తమయ్యారు.
స్వల్ప జ్వరం, నీరసంతో మరికొందరు బాధపడటంతో.. మొత్తం 150 మందిని సత్తెనపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారందరికీ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. జాయింట్ కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ఆర్డీవో రాజకుమారి, డీఎస్పీ ఆదినారాయణ ఆసుపత్రిలోని బాలికలను పరామర్శించారు. విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి అంబటి రాంబాబు చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.