సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఆమదాలవలస నుంచి శ్రీకాకుళం వైపు ఓ ఆర్టీసీ కార్గో బస్సు వస్తోంది. కొత్తరోడ్డు సమీపంలోకి వచ్చేసరికి అధికారుల బృందం బస్సును ఆపి తనిఖీ చేసింది. తలుపులు తెరిచిచూసేసరికి వందల బస్తాల్లో పదకొండున్నర టన్నుల బియ్యం బయటపడేసరికి అధికారులతో పాటు అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ప్రజారవాణా శాఖకు చెందిన బస్సులో నిర్భయంగా కాకినాడ పోర్టుకు తరలించే క్రమంలో బియ్యం పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. అటు బస్సు డ్రైవర్‌ను అధికారులు విచారించారు. ఎల్‌ఎన్‌పేట మండల స్కాట్‌పేట మిల్లు నుంచి రెండు వాహనాల్లో బియ్యం తెచ్చి లోడింగ్ చేసినట్టు డ్రైవర్ చెబుతున్నారు. అయితే సమీపంలో ఉన్నది లాడి శ్రీకృష్ణ మిల్లు మాత్రమే. పార్శిల్ బస్సులో ఎక్కించిన పీడీఎస్ బియ్యాన్ని నేరుగా కాకినాడ పోర్టుకు తీసుకువెళ్లేందుకు బుక్‌చేసుకున్నట్టు తెలుస్తోంది. బియ్యం తరలించాలంటే ఆన్‌లైన్ ప్రక్రియ ఉంటుంది. వేబిల్లులు ఉంటేనే రవాణా చేయాలి. అయితే డ్రైవర్ స్కాట్‌పేట అని చెబుతుండగా.. ఒడిశాలోని సిద్ధమనుగు ప్రాంతానికి చెందిన శ్రీసాయినాథ్ మహాలక్ష్మి మోడరన్ రైస్‌మిల్లు పేరిట బిల్లును పార్శిల్ వాహనానికి జతచేశారు. అయితే స్కాట్‌పేట వద్ద లోడు చేసినట్టు డ్రైవర్ చెబుతున్నాడు. నిజంగా లాడి శ్రీక్రిష్ణ రైస్‌మిల్లు నుంచి వచ్చాయా? లేకుంటే వేరేచోటి నుంచి తెచ్చారా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. అటు ఆర్టీసీ కార్గో సర్వీసు సిబ్బంది పాత్రపై కూడా అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్, రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ చేపడుతున్నారు. ఆర్టీసీ కార్గో బస్సును సీజ్‌చేశారు. శ్రీకాకుళం రూరల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీనిపై శ్రీకాకుళం సివిల్ సప్లయ్ డీటీ జాఫర్ షరీఫ్ వద్ద ప్రస్తావించగా.. పట్టుబడ్డ బియ్యం ఎల్‌ఎన్‌పేట మండల స్కాట్‌పేట సమీపంలోని మిల్లు వద్ద లోడింగ్ చేసినట్టు చెబుతున్నా.. సంబంధిత మిల్లరు పేరు డ్రైవర్ చెప్పలేకపోతున్నారని చెప్పారు. విజిలెన్స్ దర్యాప్తు ప్రారంభమైందని పేర్కొన్నారు. కాగా అర్ధరాత్రి వరకూ ఓ అధికార పార్టీ నేత అధికారులతో మంతనాలు సాగిస్తున్నట్టు ప్రచారం సాగింది. బియ్యాన్ని వదిలేయ్యాలని.. మిల్లరు పేరు తప్పించాలని రకరకాలుగా ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. అయినా అధికారులు వెనక్కి తగ్గనట్టు తెలుస్తోంది.