సాంకేతికత అందుబాటులోకి వచ్చాక ప్రతి దానికి వెసలుబాటు దొరుకుతోంది. తాజాగా ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ నామినీ వివరాలను ఆన్ లైన్ లోనే మార్చుకునే వీలును సంస్థ కల్పించింది. ఇప్పటికే పొందుపరిచిన నామినీ వివరాలను అవసరమైతే ఇంట్లో కూర్చునే మార్చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈపీఎఫ్ వో వెబ్ సైట్ లో లాగిన్ అయి, మార్పులు చేర్పులు చేసుకోవచ్చని వివరించారు. నామినీని గుర్తించాల్సిన సందర్భాలలో చివరిసారిగా మీరు చేసిన మార్పులను పరిగణనలోకి తీసుకుంటారు.
నామినీ పేరు మార్చాలన్నా, అదనపు వివరాలు చేర్చాలన్నా సరే.. ఆ మార్పులను ధ్రువీకరించేందుకు తగిన పత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఈపీఎఫ్ వో ఆన్ లైన్ సేవలను పొందాలంటే.. ఉద్యోగి యూఏఎన్ నెంబర్, ఆధార్ కార్డ్, ఆధార్ కార్డ్ కు లింక్ చేసిన మొబైల్ నంబర్, పీఎఫ్ చందాదారుడి వివరాలు తప్పనిసరి. నామినీ మార్పు.. ఆధార్ కార్డు, ఫొటో (స్కాన్), బ్యాంకు ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్ సీ కోడ్, పోస్టల్ చిరునామా ధ్రువీకరణ పత్రాలు అవసరం.
ఈపీఎఫ్ వో వెబ్ సైట్ లోకి లాగిన్ అయ్యాక ‘సర్వీసెస్’ ఆప్షన్ ను ఎంచుకోవాలి. అందులో ‘ఉద్యోగుల కోసం’పై క్లిక్ చేసి ‘ఈ-నామినేషన్’ ఎంచుకోవాలి. అందులో నామినీ వివరాలను అప్ డేట్ చేసి సేవ్ చేయాలి. ఈ మార్పులను ధ్రువీకరించేందుకు మీ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే.. మీ నామినీ వివరాలను మార్చడం పూర్తయినట్టే! ఇలా సింపుల్ గా నామినీ వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు.