తాజాగా ఎలక్ట్రికల్ బైక్ లా కాలం నడుస్తోంది. హైదరాబాద్ ఐఐటీ స్టార్టప్ సంస్థ ప్యూర్ ఈవీ తక్కువ ధరకే ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకొచ్చింది. ఈకో డ్రిఫ్ట్ పేరుతో తీసుకొచ్చిన ఈ మోటార్ సైకిల్ సంప్రదాయ పెట్రోల్ మోటారు సైకిళ్ల మాదిరే ఉండడం గమనార్హం. బ్లాక్, గ్రే, బ్లూ, రెడ్ రంగుల్లో ఇది లభిస్తుంది. హైదరాబాద్ లోని టెక్నికల్, తయారీ కేంద్రంలో దీన్ని అభివృద్ధి చేసినట్టు ప్యూర్ ఈవీ ప్రకటించింది. దీని ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర రూ.99,999. దేశవ్యాప్తంగా దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1,14,999.
ఈకో డ్రిఫ్ట్ 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఒక్కసారి చార్జింగ్ తో 130 కిలోమీటర్ల వరకు ప్రయాణానికి వీలు కల్పిస్తుంది. 3 కిలోవాట్ బ్యాటరీ, స్మార్ట్ బ్యాటరీ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఉపయోగించారు. బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఈ వాహనం గురించి కంపెనీ సహ వ్యవస్థాపకుడు రోహిత్ వందెర మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 100కు పైగా తమ డీలర్ల వద్ద దీన్ని టెస్ట్ డ్రైవ్ కు అందుబాటులో ఉంచగా, అద్భుతమైన స్పందన వచ్చినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని డీలర్ల వద్ద బుకింగ్ లు మొదలయ్యాయని, మార్చి మొదటి వారం నుంచి డెలివరీ చేస్తామని తెలిపారు.