ఓడలు రేవులు అవుతాయి..రేవులు ఓడలు అవుతాయి అంటే ఇదేనేమోనని అదానీ పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. అదానీ గ్రూప్ కు వ్యతిరేకంగా అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ అనే స్పెక్యులేటివ్ సంస్థ చేసిన ఆరోపణలు.. ప్రపంచ కుబేరుల్లో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ స్థానానికి ఎసరు పెట్టింది. మొన్నటి వరకు ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్న వ్యక్తిగా కొనసాగిన గౌతమ్ అదానీ.. ఇప్పుడు టాప్-10లో చోటు కోల్పోయారు. 11వ స్థానానికి వచ్చేశారు. ఇదంతా రియల్ టైమ్ మార్కెట్ విలువ ఆధారంగా మారిపోయే స్థానాలు.
ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడి స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్.. టెస్లా షేరు పతనంతో రెండో స్థానానికి దిగిపోయారు. మొదటి స్థానంలోకి బెర్నార్డ్ ఆర్నాల్ట్ వచ్చి చేరారు. అదే మాదిరి అదానీ గ్రూపు షేర్ల విలువల పతనంతో అదానీ స్థానం తగ్గిపోయింది. స్టాక్ మార్కెట్లలో ట్రేడవుతున్న ఆయా కంపెనీల షేర్ల ధరల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా కుబేరుల స్థానాలు తారుమారవుతుంటాయి.
ప్రస్తుతం అదానీ నెట్ వర్త్ 84.4 బిలియన్ డాలర్లు కాగా, ఆయన 11వ స్థానంలో ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ 82.2 బిలియన్ డాలర్ల నెట్ వర్త్ తో 12వ స్థానంలో ఉన్నారు. మూడు ట్రేడింగ్ దినాల్లో అదానీ షేర్ల పతనం వల్ల గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద 34 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది. అదానీ షేర్లలో, ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ ఓ నివేదికను విడుదల చేసింది. తాము అదానీ షేర్ల డెరివేటివ్ లు, బాండ్ డెరివేటివ్స్ లో షార్ట్ పొజిషన్లు తీసుకున్నట్టు ప్రకటించింది. అంటే నివేదిక విడుదలకు ముందే అదానీ గ్రూపు షేర్లలో అమ్మకాలు చేసింది. షేర్ల ధరలు పడిపోతే హిండెన్ బర్గ్ కు లాభాలు వస్తాయి. నిజానికి హిండెన్ బర్గ్ అనుకున్నదే జరిగింది. ఆ సంస్థ చేసిన ఆరోపణలకు అదానీ షేర్లు కుదేలయ్యాయి. ఇది హిండెన్ బర్గ్ కు మేలు చేయగా, అదానీ గ్రూప్ నకు, వాటాదారులకు నష్టం తెచ్చిపెట్టింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించడం తెలిసిందే.