ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. విద్యారంగంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై నిరంతర సమీక్ష, పర్యవేక్షణ అవసరం అని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దీనివల్ల విద్యాకానుక దగ్గరనుంచి పాఠ్యాంశాల వరకూ.. మౌలిక సదుపాయాలు దగ్గరనుంచి గోరుముద్ద వరకూ కూడా నాణ్యత పెరుగుతుందని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా.. పిల్లలకు అద్భుతమైన స్కూలు వాతావరణం అందుబాటులో ఉంటుందన్నారు. ప్రతి ఏటా విద్యాకానుక కింద ఇస్తున్న వస్తువులపై పరిశీలన అవసరం అని స్పష్టం చేశారు. పాఠ్యపుస్తకాల్లో పేపర్ క్వాలిటీ బాగుండాలని సూచించారు. పాఠశాల విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
'6వ తరగతి ఆపైన ఉన్న ప్రతి తరగతిగదిలోనూ ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల బోధన, నేర్చుకోవడం సులభతరమవుతుంది. 6వ తరగతి కన్నా దిగువ తరగతులకు టీవీ స్క్రీన్లను అందుబాటులోకి తీసుకొవస్తున్నాం. తర్వాత 8 వ తరగతి నుంచి ట్యాబ్‌లను ఇస్తున్నాం. దీని వల్ల ఇంటి దగ్గర కూడా పిల్లలు ఆడియో, వీడియో, గ్రాఫిక్స్ ఎలిమెంట్స్ ఉన్న పాఠ్యాంశాలను నేర్చుకునే అవకాశం కల్పించాం. ఇలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా డిజిటిల్ సౌలభ్యాన్ని కల్పించడంపై ఆలోచన చేయాలి. ఇది ఏ రూపంలో ఉండాలన్న దానిపై అధికారులు ఆలోచించి ప్రతిపాదనలు ఇవ్వాలి' అని సీఎం జగన్ ఆదేశించారు.
'శాశ్వతంగా పిల్లలకు ఉత్తమ బోధన అందించడానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి. విద్యార్థులు 6వ తరగతిలోకి రాగానే విద్యను సీరియస్ అంశంగా తీసుకుని మరింత దృష్టి పెట్టాలి. ఐఎఎఫ్‌పీ ఏర్పాటు, సబ్జెక్టుల వారీ టీచర్లతో వారి బోధనపై సీరియస్‌గా ఉండాలి. సీరియస్‌గా బోధన లేకపోతే ఫలితం ఉండదు. మొక్కుబడిగా చేస్తే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బ తింటుంది. వచ్చే విద్యాసంవత్సరంలోగా ఐఎఫ్‌పీ ప్యానెళ్లు అందించాలి. నాడు–నేడు పూర్తవుతున్న కొద్దీ ఆ స్కూళ్లలో ఐఎఫ్‌పీలు ఏర్పాటు ఉండాలి. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులను వచ్చే విద్యా సంవత్సరంలో స్కూళ్లు ప్రారంభంలోగా అందించడానికి చర్యలు తీసుకోవాలి' అని ముఖ్యమంత్రి ఆదేశించారు.
'పాఠ్యపుస్తకాల్లో అంశాలు, ట్యాబుల్లోని బైజూస్ కంటెంట్, ఐఎఫ్‌పీ కంటెంట్.. ఇవన్నీ కూడా పూర్తి సినర్జీతో ఉండాలి. ప్రపంచస్థాయి పోటీని తట్టుకునేందుకు వీలుగా విద్యార్థులు ఇంగ్లిషులో పట్టుపెంచుకునేందుకు వారికి చేదోడుగా నిలవాలి. ఈ క్రమంగా ఇంగ్లిషు మాట్లాడ్డం, రాయడంలో వారు మెరుగైన ప్రావీణ్యం సాధించాలి. టోఫెల్, కేంబ్రిడ్జి లాంటి సంస్థల భాగస్వామ్యాన్నికూడా తీసుకోవాలి. వీరి సహాయంతో 3వ తరగతి నుంచీ పరీక్షలు నిర్వహించి పిల్లలకు సర్టిఫకెట్లు జారీచేసేలా కార్యక్రమాలను రూపొందించాలి. టీచర్లకూ ఇంగ్లిషుపై శిక్షణ కార్యక్రమాలు కొనసాగించాలి' అని సీఎం జగన్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
ట్యాబుల వినియోగం, పాఠ్యాంశాలను నేర్చుకుంటున్న తీరుపై పిల్లల తల్లిదండ్రులకు ఫీడ్‌బ్యాక్ అందించాలని జగన్ స్పష్టం చేశారు. మార్చిలో మొదలుపెట్టి.. ఏప్రిల్ చివరినాటికి విద్యాకానుక వస్తువులన్నింటినీ స్కూళ్లకు చేరుస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలకు విద్యాకానుక కిట్ అందిస్తామన్నారు. అటు మొదటి దశ నాడు–నేడు ఆడిట్‌పై సీఎం ఆరా తీశారు. ఐఎఫ్‌పీ, టీవీ స్క్రీన్లను ఏర్పాటు చేయాలని.. అప్పుడే పూర్తిస్థాయిలో నాడు–నేడు పూర్తవుతుందని స్పష్టం చేశారు.