పలమనేరు సమీపంలోని లోకేశ్ యువగళం క్యాంపు వద్ద గురువారం పాదయాత్రకు ముందు పలువురు టీడీపీలో చేరారు. పలమనేరు మండలం మొరం పంచాయితీ మాజీ సర్పంచ్ విశ్వనాథరెడ్డితో పాటు పలువురు గ్రామస్తులు, పలమనేరు పట్టణం ఎంసీ పాళ్యంకు చెందిన 20 మంది యువత, రంగాపురానికి చెందిన 20 కుటుంబాల వారు, తెలుగు యువత నియోజకవర్గ కార్యదర్శి తుమ్మల మదన్ మోహన్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. పలమనేరు పెద్దమసీదు వీధికి చెందిన 20 కుటుంబాల వారు చాంధ్బాయ్, షకీల్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వీరికి లోకేశ్ పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషిచేయాలని, వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని వారికి పిలుపునిచ్చారు. తామంతా వైసీపీ ప్రభుత్వం తీసుకొంటున్న విధానాలు నచ్చక తెలుగుదేశంలో చేరుతున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అమరనాథరెడ్డికూడా పాల్గొన్నారు.