పార్టీ కోసం కష్టపడిన వారిని అధినాయత్వాలు గౌరవిస్తే ఆ అభయమే వేరు. తాజాగా అలాంటి ఓ పనియే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేశారు. ఇదిలావుంటే ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. పలమనేరు నియోజకవర్గంలో యాత్ర ముగిసింది.. పూతలపట్టు నియోజకవర్గంలోకి ప్రవేశించింది.. పూతలపట్టు నియోజకవర్గం ప్రజలు, టిడిపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గురువారం (ఏడో రోజు) లోకేష్ 16.2 కిలోమీటర్లు నడిచారు.. ఇప్పటివరకు నడిచిన దూరం: 88.5 కిలోమీటర్లు అని టీడీపీ తెలిపింది.
మరోవైపు లోకేష్ పాదయాత్రలో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. లోకేష్ పెద్దలను గౌరవిస్తూ అందరి ప్రశంసలు అందుకున్నారు. టీడీపీలో కార్యకర్తల నిబద్ధతని గుర్తించి గౌరవించారు. దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీయే ప్రాణంగా ఉన్న టీడీపీ కార్యకర్తల్ని గౌరవించారు. పలమనేరు పట్టణం చరణ్ ధాబా సెంటర్లో జరిగిన కార్యక్రమంలో సీనియర్ కార్యకర్తకు నారా లోకేష్ పాదాభివందనం చేశారు.
పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ కార్యకర్తలైన బాల సుందరం రెడ్డి, రామకృష్ణ, రాజా రెడ్డి, వెంకటరమణ రెడ్డి, డి. ఆర్. ప్రకాష్, బీ. పి. నాయుడు, చంద్రశేఖర్ నాయుడు, వెంకటరత్నం, దొరస్వామి నాయుడు, తంగవేలు శెట్టి, ఓబుల్ రెడ్డి, వెంకటప్ప, క్రిష్ణ గౌడ్, శీనప్ప,తిప్పారెడ్డి. నారాయణ మొదలియర్, చెంగారెడ్డి, కృష్ణమూర్తి నాయుడులకు నారా లోకేష్ పాదాభివందనం చేశారు. 'మీలాంటి పెద్దల తరగని అభిమానమే తెలుగుదేశం పార్టీకి శ్రీరామరక్ష' అంటూ లోకేష్ ప్రశంసించారు. టీడీపీ సీనియర్ కార్యకర్తలు కూడా లోకేష్‌ను దీవించారు. సాధారణ కార్యకర్తలైన తమకు పాదాభివందనం చేసి తన పెద్ద మనసు చాటుకున్నారని లోకేష్‌ని అభినందించారు.
మరోవైపు పలమనేరులో లోకేష్‌కు పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. నారా లోకేష్ కాన్వాయ్ లోని ప్రచార వాహనాన్ని సీజ్ చేశారు. అనుమతి లేకుండా వాహనాన్ని ఉపయోగించారని పలమనేరు డీఎస్పీ అన్నారు. తమ వాహనాన్ని ఆడుకోవడం పై టిడిపి నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఎందుకు వాహనాన్ని సీజ్ చేస్తున్నారంటూ పోలీసులు తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు.