పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఏపీ ముందుకు దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ చర్యల్లో భాగంగా గర్భిణులకు కొత్తగా ఉచితంగా ‘టిఫా’ స్కానింగ్ సౌకర్యాన్ని అందుబాటులో తెచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. ఈ స్కానింగ్ ద్వారా గర్భస్థ శిశువుల లోపాలను గుర్తించి, ముందుగానే జాగ్రత్తపడేందుకు వీలవుతుంది అన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో రేడియాలజిస్టులు ఉన్నచోట ఈ టిఫా స్కానింగ్ సేవలను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల్లో ఈ సౌకర్యం త్వరలోనే వస్తుందన్నారు.
మార్చి నెలలో పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అధికారికంగా ప్రారంభిస్తామన్నారు మంత్రి విడదల రజిని. పూర్తిస్థాయిలో అమలుకు అన్ని వనరులను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల నిర్మాణాలు పూర్తి చేయాలని.. క్లినిక్‌లలో సిబ్బంది పోస్టులు ఎక్కడైనా ఖాళీగా ఉంటే వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు.
ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా గిరిజన ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవ్వాలని ప్రభుత్వం కోరుకుంటోందన్నారు మంత్రి. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనల నుంచి ఈ కార్యక్రమం మొదలైందన్నారు. ఐదు కొత్త మెడికల్ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.