టీడీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో ఆయన్ని పలురంగాలకు చెందిన వారు కలుస్తున్నారు. దిలావుంటే తాజాగా నారా లోకేష్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. ఈ క్రమంలో పలమనేరులో లాయర్లు లోకేష్‌ను కలిశారు. అధికారంలోకి రాగానే ఇళ్ల పట్టాలు ఇస్తామని స్థానిక ఎమ్మెల్యే మోసం చేశారని లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. అధికారంలోకి రాగానే న్యాయవాదులకు ఇళ్లపట్టాలు.. ఇదే అంశాన్ని మేనిఫెస్టోలో పెడతామన్నారు నారా లోకేష్. పలమనేరులో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేస్తామని.. కోర్టు బైఫర్ కేషన్ జరిగితే పలమనేరులోనే కోర్టు ఏర్పాటవుతుందన్నారు.
లాయర్లతో సమావేశంలో లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024లో ఎవరు గెలిచినా తలనొప్పే కదా తాను చంద్రబాబును అడిగానని.. ఆయన ఎందుకురా అని తనను అడిగారని.. లక్షల కోట్లు అప్పులు భయం వేస్తోందని చంద్రబాబు దగ్గర ప్రస్తావించానన్నారు. చంద్రబాబు ' Where there is a crisis there is opportunity అని చాలా సింపుల్ గా చెప్పేశారు' అని ప్రస్తావించారు. సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలచుకోవాలని ఆయన ఎప్పుడూ చెబుతుంటారన్నారు.
1995లో ఆయన ముఖ్యమంత్రి అయిన సమయంలో ఇలాంటి పరిస్థితి వచ్చిందని.. 2014లో అదే పరిస్థితి వచ్చిందన్నారు. హైదరాబాద్, అమరావతిలు చేయలేదా.. కియా, విశాఖకు ఐటీ కంపెనీలు రాలేదా.. తప్పదు లేరా అని చంద్రబాబు తనతో చెప్పినట్లు లోకేస్ వివరించారు. 'మీకు అనుభవించే తలరాత లేదు.. కష్టపడటమే తలరాతగా ఉంది.. అనుభవించే టైంకు ఓడిపోతారు.. కష్టకాలం వచ్చినప్పుడే అధికారంలోకి వస్తారు' తాను చంద్రబాబు దగ్గర ప్రస్తావించానన్నారు. 2024లో కూడా అదే పరిస్థితి వస్తుందన్నాను.. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు మళ్లీ దారిలోకి తేగలరని లోకేష్ వ్యాఖ్యానించారు. కష్టకాలంలోనే చంద్రబాబు గుర్తుకొస్తారని.. 2014లో గుర్తుకొచ్చారు.. ఇప్పుడు గుర్తుకొచ్చారన్నారు.
అనంతరం జరిగిన సభలో లోకేష్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో యుద్ధం మొదలైంది.. జగన్ పతనం నెల్లూరు నుంచి మొదలైందన్నారు. ఏపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 151సీట్లతో జగన్ కి అధికారం కట్టబెట్టారని.. 3.8 సంవత్సరాల్లో ఒక్క కంపెనీ అయినా తెచ్చారా అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ ఒక్కటైనా తెచ్చారా.. ఏపీలో ఉన్న కంపెనీలన్నీ పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి పేద, మధ్య తరగతి కుటుంబాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు.
రైతులు జగన్ పాలనలో అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో ఉందన్నారు. కార్మికులు పక్క రాష్ట్రాలకు వలసలు పోతున్నారన్నారు. ప్రజల సమస్యలపై మాట్లాడినా, ట్వీట్, పోస్టు పెట్టినా కేసులు పెడుతున్నారన్నారు లోకేష్. 2019కి ముందు తనపై ఒక్క కేసు లేదు.. జగన్ సీఎం అయ్యాక తనపై 19 కేసులు పెట్టారన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసు, హత్యాయత్నం కేసు పెట్టారన్నారు. ఈ భూమి మీద తాను, జగన్ శాశ్వతం కాదు.. ఈ రాష్ట్రం శాశ్వతం అన్నారు.