చైనా దేశం ఏ నిర్ణయం తీసుకొన్నా వాటిని కఠినంగా అమలు చేస్తుంది. తాజాగా అదే నిర్ణయం అక్కడి వ్యాపారులకు సంకటంగా మారింది. ప్రపంచంలో అత్యధికంగా బిలినీయర్లు కలిగిన దేశాల్లో ఒకటైన చైనాలో ప్రస్తుతం పారిశ్రామికవేత్తలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దీంతో బిలియనీర్ల వలసబాట పట్టారు. అధికార కమ్యూనిస్ట్ పార్టీ తీసుకుంటున్న చర్యలకు భయపడి, సురక్షితంగా ఉంటుందని సింగ్‌పూర్‌కు పారిపోతున్నారు. నిర్బంధ వాణిజ్య విధానాలు, ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోతే వేధింపులకు గురిచేయడం, వ్యాపారాలను దెబ్బతీయడం, అక్రమ కేసులు పెట్టడంతో చైనాలో బిలియనీర్లకు కంటిమీద కునుకు కరవయ్యింది. జిన్‌పింగ్ ప్రభుత్వ నియంత పోకడలకు విసిగిపోయి దేశం వదిలిపెడుతున్నారు.
ఇలా వలస పోయేవారికి సింగపూర్ ఆశాకిరణంగా కనిపిస్తోంది. వ్యాపారులు, పారిశ్రామిక దిగ్గజాలపై కఠిన ఆంక్షలు విధించడం, మూడేళ్ల పాటు జీరో కోవిడ్ విధానం తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొన్న కోటీశ్వరులు సింగపూర్ సురక్షితంగా భావిస్తున్నారు. చాలామంది ఆ దేశంలోనే శాశ్వతంగా ఉండిపోవాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఆరు దశాబ్దాల నుంచి ఒకే పార్టీ అధికారంలో కొనసాగడం, తక్కువ పన్నులు, స్వేచ్ఛా వాణిజ్య విధానాలు, త్వరితగతిన పరిశ్రమలకు అనుమతులతో ప్రపంచంలోనే సింగ్‌పూర్ అగ్రభాగాన ఉంది. విదేశీ పెట్టుబడులకు కూడా గమ్యస్థానంగా మారింది. పెట్టుబడిదారులను ఆకర్షించడంలోనూ ముందుంది.
సింగపూర్ జనాభాలో రెండింట మూడోవంతు చైనీయులే కావడం గమనార్హం. ఒకవేళ అక్కడికి వెళ్లినా.. సొంత దేశాన్ని వీడిన భావన వారిలో కలగదు. అందుకే ఎక్కువ మంది సింగపూర్ వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో చైనా సంపన్నులను ఆకట్టుకునేందుకు అక్కడ సర్కార్ కూడా చర్యలు చేపడుతోంది. జిన్‌పింగ్ సర్కారు వైఖరికి విసిగిపోయి దాదాపు 10వేల మంది బిలియనీర్లు.. చైనా నుంచి ఇతర దేశాలకు వెళ్లిపోవాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇలా వెళ్లేవారికి సింగపూర్ మొదటి ఎంపికగా మారింది. తర్వాత స్విట్జర్లాండ్, ఇజ్రాయేల్, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాలు ఉన్నాయి. ఇటీవలి చైనీస్ రాకపోకల ఉనికిని సింగపూర్‌లో తీవ్రంగా భావించారు, కొంతమంది సెంటోసా ద్వీపంలో వాటర్‌ఫ్రంట్ వీక్షణలతో విలాసవంతమైన గృహాలకు మకాం మార్చారు, ఇందులో థీమ్ పార్క్, క్యాసినో మరియు ప్రతిష్టాత్మక గోల్ఫ్ క్లబ్ కూడా ఉన్నాయి.
ఇమ్మిగ్రేషన్, పునరావాస సేవలను అందించే సంస్థ ఎయిమ్స్ సీఈఓ పియర్స్ చెంగ్ మాట్లాడుతూ.. ‘వారు డబ్బు ఖర్చు చేసే విధానాన్ని మీరు ఊహించలేరు. ఇది వెర్రితనం..’ అన్నారు. ఒక క్లయింట్ పార్టీకి హాజరైన విషయాన్ని గుర్తుచేసుకున్న పియర్స్.. అక్కడ 800,000 డాలర్ల ఖరీదు చేసే అరుదైన జపాన్ ‘యమజాకి 55’ విస్కీ అందజేశారన్నారు.
ఆసియాలో వ్యాపార ప్రముఖల్లో ఒకరైన జాక్ మాపై చైనా యంత్రాంగం 2020లో తీసుకున్న చర్యలతో 25 బిలియన్ల డాలర్ల సంపదను కోల్పోయారు. తమ విషయంలోనూ ఇలాగే వ్యవహరించే అవకాశం ఉందని మిగతా వ్యాపారవేత్తలు భయపడుతున్నారు.సింగపూర్‌కు వెళ్లడం అనేది కుటుంబ సంపదను సురక్షితంగా ఉంచడం.. అనేక తరాల వరకు ఉండేలా చూసుకోవడంగా భావిస్తున్నారు. ఓ వ్యాపారవేత్త మాట్లాడుతూ.. ‘కనీసం నేను ఇక్కడ ఉన్నప్పుడు.. నా డబ్బు నాదని నాకు భరోసా లభిస్తుంది’ అని వ్యాఖ్యానించారు.