ఎండకాలంలో మండే ఎండలకు మనం అబ్బా అని నిటూర్చుతాం. కానీ అక్కడ మాత్రం ఏకంగా అడవియే తగలబడింది. దక్షిణ అమెరికా దేశంలో చిలీ అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చు చెలరేగింది. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో ప్రాణాలు కోల్పోతున్నారు. వేసవి వేడిగాలులు కారణంగా దక్షిణ మధ్య చిలీ అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటల్లో 13 మంది కాలిబూడిదయ్యారు. రాజధాని శాంటియాగోకు దక్షిణంగా సుమారు 500 కి.మీ దూరాన ఉన్న బయోబియోలోని శాంటా జువానా పట్టణం పరిసర ప్రాంతాల్లో మంటలను అదుపుచేసే క్రమంలో అగ్నిమాపక సిబ్బందితో సహా 11 మంది చనిపోయినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. లా అరౌకానియా దక్షిణ ప్రాంతంలో మంటలను అదుపుచేసే క్రమంలో ఎమర్జెన్సీ సర్వీసెస్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో పైలెట్, మెకానిక్ ఇద్దరు మరణించారు.
అడవుల్లో కార్చిచ్చు కారణంగా 13 మంది మరణించినట్లు చిలీ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకూ 14 వేల హెక్టార్ల విస్తీర్ణంలో అడవికి మంటలు వ్యాపించినట్టు పేర్కొంది. బయోబియో, పొరుగున ఉన్న నబుల్ రాష్ట్రాల్లోని వ్యవసాయం, అటవీ ప్రాంతాలకు విపత్తు పొంచి ఉందని ప్రకటించిన ప్రభుత్వం... సైనికులు, అదనపు వనరులను మోహరిస్తోంది. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మంటలు చెలరేగాయని, వందలాది గృహాలు దెబ్బతిన్నాయని చిలీ ప్రభుత్వం ప్రకటించింది.
రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారే సూచనలు ఉన్నాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కాగా, దేశంలోని 151 ప్రాంతాల్లో మంటలు చెలరేగగా.. 65 చోట్ల అదుపులోకి వచ్చాయి. 39 ప్రాంతాల్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషిచేస్తున్నారు.
చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్.. కార్చిచ్చు చెలరేగిన న్యూబుల్, బయోబియోల్ ప్రాంతాల్లో పర్యటించారు. అత్యవసర పరిస్థితుల్లో అన్ని వనరులు అందుబాటులో ఉండేలా చూస్తామని, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వారికి రక్షణ కల్పిస్తామని బోరిక్ హామీ ఇచ్చారు. కొందరు ఉద్దేశపూర్వకంగానూ మంటల చెలరేగడానికి కారణం అయ్యి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై దృష్టిసారించేలా అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. మంటలను అదుపుచేయడానికి బ్రెజిల్, అర్జెంటీనా సహాకారంతో 63 విమానాలను సిద్దంగా ఉంచారు. ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా.. ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో ఉండటానికి కొందరు నిరాకరిస్తున్నారు.