అధికార్లంతా అధికార దర్పం ప్రదర్శించారు. వారిలోనూ మానవత్వం నిండినవారు ఉంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకొంది. నిత్యం లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తూ విశేషమైన సేవలు చేస్తున్న భారతీయ రైల్వే (మానవత్వంతోనూ అందరి మనసులు గెలుచుకుంటోంది. రైలులో ప్రయాణిస్తున్న ఓ గర్భిణికి అకస్మాత్తుగా పురిటినొప్పులు రాగా.. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది ఆమెకు పురుడు పోశారు. దీంతో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు. అస్సాంలోని రంగియా స్టేషన్‌లో బుధవారం (ఫిబ్రవరి 1) ఈ ఘటన చోటు చేసుకుంది.
కామ్‌రూప్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణిస్తున్న ఒక మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. అప్పుడే అక్కడికి వచ్చిన ఆన్‌బోర్డ్ రైల్వే టికెట్ చెకింగ్ సిబ్బంది, కోచ్‌లో ఉన్న ఆర్‌పీఎఫ్ సిబ్బంది ఆమె పరిస్థితిని గమనించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రైలు రంగియా స్టేషన్‌కు చేరుకోగానే.. స్టేషన్‌లోని రైల్వే అధికారుల భవనానికి ఆమెను తరలించారు. రైల్వే డాక్టర్‌కు అప్పటికే సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడ సిద్ధంగా ఉన్నారు. సరైన సమయంలో సేవలు అందించి, ఆ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చేలా వారంతా తోడ్పడ్డారు. అనంతరం తల్లీబిడ్డలను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.ఘటనకు సంబంధించిన ఫోటోలను రైల్వే మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ‘Humanity at the top!’ అంటూ షేర్ చేసిన ఈ పోస్టు వైరల్ అవుతోంది. ఇండియన్ రైల్వేపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.