ప్రైవేటు రంగం అంటే ఎపుడు ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియని పరిస్థితి. కానీ ఓ సంస్థ అబ్బురపరిచే నిర్ణయం తీసుకొంది. ఆర్ధిక మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా ఐటీ దిగ్గజాలు ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో పలు కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. గూగుల్, మెటా, అమెజాన్ సహా పలు అంతర్జాతీయ సంస్థలు ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నాయి. రోజుకో కంపెనీ లేఆఫ్ ప్రకటిస్తుండటంతో సాఫ్ట్‌వేర్ నిపుణులు, ఆశావహుల్లో ఆందోళన మొదలయ్యింది. ఇటువంటి సమయంలో భారత్‌కు చెందిన ఓ ఐటీ కంపెనీ మాత్రం.. తమ ఉద్యోగులకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచింది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన త్రిథ్యా టెక్ సంస్థ ఇటీవలే ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మంచి పనితీరు కనబరించిన తమ సంస్థలోని 13 మంది ఉద్యోగులకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల కృషి వల్లే కంపెనీ ఈ స్థాయికి చేరుకుందన్న ఆ సంస్థ ఎండీ రమేశ్ మరాండ్.. అందుకు గుర్తింపుగా కానుకలను అందజేస్తున్నట్లు తెలిపారు. సంస్థ ప్రారంభం నుంచి వీరంతా మా వెంట ఉన్నారని వివరించారు. అందుకే వచ్చిన లాభాలను ఉద్యోగులతో పంచుకోవడమే మంచిదని భావించామని చెప్పారు. అంతేకాదు, రాబోయే రోజుల్లోనూ ఉద్యోగులకు ఇటువంటివి మరిన్ని ఆఫర్లు ఉంటాయని పేర్కొన్నారు.
ఉద్యోగులు పూర్తిగా భాగస్వామ్యం కావడంతోపాటు కష్టపడి పనిచేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని ఎండీ అన్నారు. కాగా, ఈ సంస్థ ఈ-కామర్స్, వెబ్, మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ వంటి సాంకేతిక సేవలను అందజేస్తోంది. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే త్రిథ్యా టెక్‌కు.. ఆసియా, ఐరోపా, ఆస్ట్రేలియాలోనూ క్లయింట్స్ ఉన్నారు.
కాగా, గతేడాది కూడా చెన్నైకి చెందిన ఐడియాస్2ఐటీ అనే సంస్థ 100 మంది ఉద్యోగులకు మారుతీ కార్లను బహుమతిగా అందించింది. తమ సంస్థలో 500 మంది ఉద్యోగులు ఉన్నారని.. అందులో 10 ఏళ్లకు పైగా పనిచేస్తున్న వారి సేవలకు గుర్తింపుగా ఈ బహుమతులు అందిస్తున్నట్లు అప్పట్లో వెల్లడించింది. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. రెండు నెలల్లోనే 1.50 లక్షల మంది ఉద్యోగులు లేఆఫ్‌లు అందుకున్నారు. గూగుల్ (12,000), అమెజాన్ (18,000) చరిత్రలోనే అతిపెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తుండటం గమనార్హం.
ఇదిలావుంటే కాగా, చైనాకు చెందిన క్రేన్త తయారీ సంస్థ బోనస్ కింద 30 మందికిపైగా ఉద్యోగులకు 61 మిలియన్ యువాన్లు (రూ.73 కోట్లు) అందజేసింది. అంతేకాదు, ఆ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయకుండా పెద్ద ఎత్తున వేడుకను నిర్వహించి డబ్బును కట్టకట్టలుగా వేదికపై పేర్చి పంచిపెట్టింది. దీంతో ఆ నగదును తీసుకెళ్లడానికి ఉద్యోగులు బ్యాగులు తెచ్చుకుని నింపుకెళ్లడం గమనార్హం