అత్యవసర వైద్యం కోసం ఓ మహిళను కడపకు తీసుకొస్తుండగా అదుపుతప్పి అంబులెన్స్ బోల్తాపడింది. మహిళకు తీవ్రగాయాలై మృతిచెందారు. ఈ ఘటన కడప తాలూకా పరిధిలో శనివారం చోటుచేసుకుంది. జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామానికి చెందిన లక్ష్మీదేవి (59) అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెను జమ్మలమడుగులోని క్యాంబెల్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి సంబంధించిన అంబులెన్స్ లో కడపకు తీసుకొస్తుండగా ఆలంఖాన్ పల్లె సమీపంలోని దండు వద్దకు రాగానే ముందు వెళ్తున్న వాహనం దారివ్వకపోవడంతో డ్రైవరు ఉన్నఫలంగా బ్రేకులు వేశారు. దీంతో అంబులెన్సు అదుపు తప్పి బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన లక్ష్మీదేవిని రిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆమె భర్త సుబ్బరాయుడు, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.