యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య విమానం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ అమ్మవారిని 33 కోట్ల దేవతల సాక్షిగా వివాహమాడిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దివ్య విమాన రథంపై అధిష్టించి ఊరేగింపును ఆలయ అర్చకులు దేవస్థానం అధికారులు సిబ్బంది పోలీసులు బందోబస్తు మధ్య ఘనంగా జరిపారు. శ్రీ లక్ష్మీ నరసింహుడు అమ్మ వారితో కలిసి తిరువీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వడం అంటే వివాహం తర్వాత జరిగే బరాత్ వేడుకను రథోత్సవంగా భక్తజనం కోసం దేవస్థానం వారు నిర్వహిస్తుంటారు. యాదగిరి వాసా గోవిందా. గోవిందా అంటూ భక్తులు జయ జయ ద్వానాలు చేశారు. రథోత్సవంలో ఆనంద పరవశులైన భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహుని కొలుస్తూ ముందుకు సాగారు. రథం పైన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని అధిష్టింప చేయగానే శ్రీలక్ష్మీనరసింహ గోవిందా గోవిందా నామస్మరణలతో పాతగుట్ట పరిసరాలు మారుమ్రోగి పోయాయి. విశ్వశాంతి లోకకల్యాణార్థం కోసం లక్ష్మీనరసింహుడు జరుపుకునే రథోత్సవంలో భక్తులు దర్శించుకున్నారు. మంగళ వాయిద్యాల నడుమ భక్తులు కోలాటాలు, నృత్యాలు చేశారు.