భార్యతో గొడవ పడి క్షణికావేశంలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గోపాలపట్నం స్టేషన్ పరిధిలోని లక్ష్మీనగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వరంగల్‌కు చెందిన ముత్యం నవీన్ (30)కు గోపాలపట్నం సమీపంలోని లక్ష్మీనగర్‌కు చెందిన నాగమణితో మూడేళ్ల క్రితం వివాహమైంది. లక్ష్మీనగర్‌లోని ఓ అద్దె ఇంట్లో ఈ దంపతులు ఉంటున్నారు. నగరంలో ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్న నవీన్ తన పని ముగించుకుని శనివారం రాత్రి ఒంటిగంటకు ఇంటికి వచ్చాడు. అయితే ఆ సమయంలో నవీన్ మరో మహిళతో ఫోన్‌లో మాట్లాడడాన్ని గమనించిన నాగమణి భర్తను నిలదీసింది. దీంతో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది.
అనంతరం నాగమణి సమీపంలో వుంటున్న తన అమ్మ వాళ్ల ఇంటి నుంచి భోజనం తీసుకురావడానికి వెళ్లి వచ్చేసరికి ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. తలుపులు తెరవమని నాగమణి ఎంత పిలిచినా నవీన్ బదులివ్వకపోవడంతో చుట్టుపక్కల వారి సాయంతో ఇంటి వెనక నుంచి ఆమె తలుపులు తెరిచింది. ఇంట్లోకి వెళ్లి చూడగా నవీన్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించడంతో స్థానికుల సాయంతో కిందకు దించి గోపాలపట్నం 30 పడకల ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే నవీన్ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. నాగమణి ఫిర్యాదు మేరకు గోపాలపట్నం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నవీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.