ఇటీవల విమాన ప్రయాణాలు ఓ సవాల్ గా మారుతున్నాయిి. విమానం టేకాఫ్ తీసుకుంటుండగా ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. థాయిల్యాండ్ లోని ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిందీ ఘటన. వెంటనే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. రష్యాలోని అజుర్ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 767 300ఈఆర్ విమానం.. 300 ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో ఫుకెట్ నుంచి మాస్కోకు బయల్దేరింది. అయితే టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో కుడివైపున ఇంజిన్, టైర్లలో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే గుర్తించిన విమానాశ్రయ అధికారులు విమానాన్ని నిలిపేశారు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. వారిని ఇంకో విమానంలో పంపించారు.
విమానం ముందుకు వెళ్తుండగా కుడి వైపున రెక్కల నుంచి పొగలు రావడం ఓ వీడియోలో కనిపించింది. విమానంలో ఉన్న వ్యక్తి దీన్ని రికార్డు చేశాడు. టేకాఫ్ సమయంలో పెద్ద శబ్దం వినిపించింది. ల్యాండింగ్ గేర్‌లో కూడా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనతో దాదాపు 40 నిమిషాల పాటు రన్ వే ను మూసేశారు. 47 విమానాలు ఆలస్యమయ్యాయి. ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.