చిత్తూరు జిల్లా, శ్రీరంగరాజపురం మండలం పిళ్లారికుప్పం గ్రామంలో ఇటీవల జరిగిన మునుస్వామిరెడ్డి(65) దారుణహత్యకు హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పిళ్లారికుప్పానికి చెందిన మునుస్వామిరెడ్డి ఇటీవల పొలం వద్ద హత్యకు గురయ్యారు. పోలీసులు అనుమానస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వివరాలను ఎస్ఐ షేక్షావలితో కలిసి మంగళవారం కార్వేటీనగరం సీఐ చంద్రశేఖర్ మీడియాకు వెల్లడించారు. ఆ ప్రకారం.. తన పొలంలో మునుస్వామిరెడ్డి ఉన్నారు. ఆ క్రమంలో పిళ్లారికుప్పం దళితవాడకు చెందిన క్రిష్ణమూర్తి(45) గ్రామంలో ఓ వ్యక్తి చనిపోవడంతో దహన క్రియల కోసం కొంత మందితో కలిసి కట్టెలు కొట్టడానికి గ్రామ సమీపంలోకి వెళ్లారు. తిరిగి తన పొలం దారిలో వచ్చిన క్రిష్ణమూర్తిని మునుస్వామిరెడ్డి దూషించారు. వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తన పక్కనే ఉన్న కర్రతో మునుస్వామిరెడ్డిని క్రిష్ణమూర్తి బలంగా కొట్టడంతో, ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. క్రిష్ణమూర్తి అక్కడి నుంచి పారిపోయాడు. మంగళవారం పిళ్లారికుప్పం క్రాస్ వద్ద క్రిష్ణమూర్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు.