చిత్తూరు జిల్లా, వి.కోట మండలం యాలకల్లు పంచాయతీ ఎర్రినాగేపల్లెలో మంగళవారం జరిగిన జల్లికట్టులో అపశ్రుతి చోటుచేసుకుంది. పరుగులు పెడుతున్న పశువులను నిలువరించే క్రమంలో మోర్నపల్లెకు చెందిన కృష్ణప్ప కుమారుడు శీనప్ప(54) మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇక్కడి జల్లికట్టు కోసం జిల్లాతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచీ భారీ ఎత్తున పశువులను యజమానులు తీసుకొచ్చారు. జల్లికట్టు వేడుకను తిలకించేందుకు పెద్దఎత్తున పరిసర గ్రామాల నుంచి తరలి వచ్చిన వారితో ఎర్రినాగేపల్లె జనసంద్రాన్ని తలపించింది. గ్రామం ఎగువ నుంచి పశువులను పరుగులు పెట్టించారు. వీటిని నిలువరించే క్రమంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మోర్నపల్లెకు చెందిన శీనప్ప నిలబడి ఉండగా.. అటుగా వచ్చిన ఎద్దును అదిరించాడు. అది అతడిని ఛాతీ భాగంలో కుమ్మింది. దీంతో ఆయన అక్కడే కుప్పకూలగా.. స్థానికులు వి.కోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గజేంద్ర, రమణ, మహేష్, చాన్‌బాషా సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని మెరుగైన వైద్యం కోసం కుప్పం పీఈఎస్ వైద్య కళాశాల ఆస్పత్రికి తీసుకెళ్లారు.