యువగళం పాదయాత్రలో భాగంగా 12వ రోజైన మంగళవారం సాయంత్రం చిత్తూరులోని టీడీపీ జిల్లా కార్యాలయ వెనుక భాగంలోని మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడారు. ‘చిత్తూరు ఎమ్మెల్యే కారులో వెళుతూ ఉంటాడు. ఎక్కడ ప్రభుత్వ భూములు, కొండలు, గుట్టలు కనపడినా కొట్టేస్తారు. గుడిపాల మండలం నారగల్లులో 300 ఎకరాల పశువుల మేత భూమిని, చిత్తూరు- తచ్చూరు రోడ్డుకు పక్కనే 80 ఎకరాల భూమిని స్వాహా చేశారు. చివరకు మాజీ సైనికుల భూములను కూడా లాక్కున్న ఘనుడు జేఎంసీ శ్రీనివాసులు. నీతిగా, నిజాయితీగా క్వారీలను నడుపుకుంటున్న వారిని బెదిరించి ఎమ్మెల్యే అన్న కొడుకు శివ అక్రమ క్వారీలను నడుపుతున్నారు. చిత్తూరు- తచ్చూరు రోడ్డు కాంట్రాక్టర్‌ను బెదిరించి రూ.6 కోట్లు వసూలు చేశారు. చిత్తూరు నియోజకవర్గంలో రోడ్డు వేయాలన్నా, ఇతర కాంట్రాక్టు పనులైనా ఎమ్మెల్యే సొంత కంపెనీకే వెళుతోంది. ఎక్కడైనా ప్రభుత్వానికి చెందిన పాత భవనాలుంటే వాటిని పడగొట్టడం.. తిరిగి వాటిని నిర్మించడం కూడా ఆయనే బినామీ పేర్లతో కాంట్రాక్టులు తీసుకుంటున్నారు’ అని ధ్వజమెత్తారు. రోగులు, ఇతర ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇచ్చే సీఎం రిలీఫ్ ఫండ్‌లో, తుఫాన్ బాధితుల నుంచీ 20 శాతం కమీషన్ తీసుకుంటున్న ఘనుడు శ్రీనివాసులు అన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.500 కోట్లను అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. ‘జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి చెప్పాల్సిన పనేలేదు. జిల్లాలో మద్యం, మైనింగ్, ఇసుక అక్రమ రవాణా.. ఇలా ఏ వ్యాపారమైనా ఆయన అనుచరులే ఉన్నారు’ అని లోకేశ్ విమర్శించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.