లండన్ లో అక్కడి కోర్టు ఓ వ్యక్తికి విధించిన శిక్షలు అతడి నేర తీవ్రతను తెలియజేస్తున్నాయి. అత్యాచారం కేసుల్లో ఓ వ్యక్తికి న్యాయమూర్తి ఏకంగా 36 యావజ్జీవ కారాగార శిక్షలు విధించడం సంచలనమైంది. ఈ సంఘటన లండన్ లో చోటు చేసుకుంది. ఈ శిక్ష వేసిన న్యాయమూర్తి భారత సంతతి వ్యక్తి కావడం గమనార్హం. మాజీ పోలీసు అధికారి అయిన డేవిడ్ కారిక్ (48) మహిళలపై అత్యాచారం కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 2003 నుంచి 2020 వరకు 12 మంది మహిళలపై అత్యాచారం చేసి, వారిని హింసించాడు. అతను మొత్తంగా 48 అత్యాచారాలు సహా 71 లైంగిక నేరాలకు పాల్పడినట్లు రుజువైంది.
ఈ నేరాలన్నీ నిరూపితం అవ్వడంతో లండన్ లోని సౌత్ వార్క్ క్రౌన్ కోర్టు న్యాయమూర్తి పరమ్ జిత్ కౌర్ ఈ కేసుల్లో అతనికి శిక్ష ఖరారు చేశారు. దోషికి ఏకంగా 36 యావజ్జీవ కారాగార శిక్షలు విధిస్తూ తీర్పునిచ్చారు. పైగా, అన్ని శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని స్పష్టం చేశారు. 30 ఏళ్లు జైలు జీవితం గడిపిన తర్వాతే పెరోల్ కు అనుమతి ఉంటుందన్నారు.