ప్రకాశం జిల్లా, సంతమాగలూరు మండలంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. పాతమాగులూరు, లక్ష్మీపురం గ్రామాల మధ్య జరిగిన ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం మల్లవరం గ్రామానికి చెందిన దగ్గెంపూడి వెంకటేశ్వరరెడ్డి(36), పోలగట్ల వెంకటేశ్వరరెడ్డి (40) అక్కడికక్కడే మృతి చెందారు. బొలారో వాహనంలో గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి తిరిగివస్తున్నారు. ఈక్రమంలో గుంతకల్లు నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు, వీరు ప్రయాణిస్తున్న వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వీరిద్దరు క్యాబిన్లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆర్టీసీ బస్సులో 13 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరికి ఎలాంటి ప్రమాదం జరగ లేదు. మృతి చెందిన వారికి భార్య, పిల్లలు ఉన్నారు. ఎస్ఐ నాగశివారెడ్డి సంఘటనా స్థలానికి వచ్చి వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను ఎక్స్కవేటర్ సాయం తో బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ నాగశివారెడ్డి తెలిపారు.