కృష్ణ జిల్లా, వత్సవాయి మండలంలోని వేములనర్వ గ్రామ సమీపంలోని సుబాబుల్ తోటలో బుధవారం ఆర్ధిక ఇబ్బందుల కారణంగా దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్రం మధిర మండలం మాటూరుకు చెందిన పుట్ట రాజేశ్వరరావు (24), నందిగామ మండలం పల్లగిరి గ్రామానికి చెందిన శ్రీకళకు వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. పల్లగిరిలోనే ఉంటున్న వాళ్లు మూడు నెలల కిత్రం నందిగామ వద్ద అనాసాగరం గ్రామంలో కూలీ పనులకు వెళ్లారు. మంగళవారం బంధువులకు ఫోన్ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పటంతో వారు నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రాజేశ్వరరావు మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వేములనర్వ వద్ద ఉన్నట్టు పోలీసులు కనుగొన్నారు. వారి మృతదేహాల వద్ద ఉన్న కూల్‌డ్రింక్ సీసాలు, పురుగు మందు డబ్బాల ఆధారంగా వారు డ్రింక్‌లో పురుగు మందు తాగి చనిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు. వేములనర్వ రోడ్డు సమీపంలో వారిద్దరు వచ్చినట్టు చెబుతున్న బైక్ లభ్యమైంది. సంఘటన వత్సవాయి మండల పరిధిలో జరిగినప్పటికీ నందిగామ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఉండటంతో వారు కేసును దర్యాప్తు చేస్తున్నారు.