టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 14వ రోజుకు చేరింది. గురువారం ఉదయం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించారు. ముందుగా ఆత్మకూరు ముత్యాలమ్మ గుడి లో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత ఆత్మకూరు గుడ్ షెఫర్డ్ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల ప్రతినిధులు లోకేష్‌ను కలిసి సమస్యలను విన్నవించుకున్నారు. టీడీపీ హయాంలో ప్రైవేట్ విద్యా సంస్థల అనుమతుల పునరుద్ధరణ 10 ఏళ్లకు ఒక సారి జరిగేదని... వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 3 ఏళ్లకు ఒకసారి అనుమతులు రెన్యువల్ చేసుకోవాలని నిబంధన పెట్టారని, దీంతో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ పదేపదే తిరగాల్సి వస్తోందని, పాత పద్ధతినే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు ఫైర్ డిపార్ట్‌మెంట్ అనుమతులు కోసం వేధింపులకు గురిచేస్తున్నారని, ప్రైవేటు విద్యాసంస్థలకు విద్యుత్ బిల్లుల స్లాబ్‌ను 2 నుంచి 7కు మార్చాలని కోరారు.