రాజకీయంగా వైసీపీ పార్టీ మరో అడుగు ముందుకేసింది. ప్రతి ఇంటిలో వైఎస్ జగన్ ఫొటో ఉండేలా పక్కా రాజకీయ ప్రచారపర్వానికి తెర తీస్తోంది. ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ ఇంటి గుమ్మాలకు స్టిక్కర్లు వేసేందుకు సిద్ధమవుతోంది. కొత్తగా పార్టీ స్థాయిలో నియమించిన గృహసారథుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఇంటి యజమాని అనుమతితో ఈ స్టిక్కర్లు ప్రతి ఇంటికీ అంటించేలా.. కార్యాచరణను అధికార పార్టీ ప్రారంభించింది. అయితే, గ్రామం, వార్డుల్లో భిన్న రాజకీయ అభిప్రాయాలు కలిగిన కుటుంబాలు ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని వలంటీర్లను ముందు పెట్టనున్నారు. ప్రజలకు వలంటీర్ల ముఖాలు సుపరిచితం. అందువల్ల పార్టీ కార్యకర్తతో పోల్చితే వలంటీర్లకు గ్రామం, వార్డుల్లో చొరవ ఎక్కువ. భిన్న రాజకీయాలతో ఉండే కుటుంబాల్లోకి చొచ్చుకువెళ్లగలిగే అవకాశం వారికి ఉంటుంది. దీంతో వలంటీర్ల సహకారంతో, గృహసారథుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా జయప్రదం చేయాలని ఆ పార్టీ ఇప్పటికే తన శ్రేణులకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. సచివాలయాల్లోకి వెళ్తుంటే వైసీపీ కార్యాలయానికి వెళ్తున్నట్లుందని ఇప్పటికే గ్రామాల్లో వినిపిస్తోన్న మాట. స్టిక్కర్ల కార్యక్రమం కూడా ప్రారంభమైతే ఇళ్లల్లో కూడా వైసీపీ రంగులు, జగన్ బొమ్మలతో నిండిపోతాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లేది లేదని జగన్ చెబుతూ వస్తున్నారు. కానీ, స్టిక్కర్ల హడావుడి మొదలైతే ఎన్నికల వాతావరణాన్ని ఏడాదిన్నర ముందుగానే రాష్ట్రంలోకి తెచ్చినట్టే!