ఉద్యోగం ఇప్పిస్తానంటూ తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలం రాచర్లకు చెందిన వర్ల రాజశేఖర్ అనే వ్యక్తి నిరుద్యోగులను మోసం చేశాడని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితులు తెలిపిన వివరాలివి.. గుంటూరుకు చెందిన జులాన్ రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నాడు. అతని తండ్రి రైల్వే ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యాడు. తండ్రికి సంబంధించిన ఉద్యోగం ఇప్పిస్తానని రాజశేఖర్ నమ్మించి రూ.50 వేలు తీసుకుని సమాధానం చెప్పడంలేదని జులాన్ వాపోయాడు. తనను మరో రూ.1.5 లక్షలు ఇవ్వాలని చాలా కాలం వేధించాడని, తన వద్ద డబ్బులు లేకపోవడంతో తొలుత ఇచ్చిన సొమ్ము ఇవ్వడానికి నిరాకరించాడని ఫిర్యాదు చేశాడు. అప్పటి మంత్రి మాణిక్యాలరావు ద్వారా నిట్‌లో ఉద్యోగం వేయిస్తానని రాజశేఖర్ రూ.2 లక్షలు వసూలు చేశాడని, తాను ఇచ్చిన సొమ్ముకు సమాధానం చెప్పడం లేదని, అతను తీసుకున్నాడనే విషయంపై తన వద్ద వీడియోలు ఎల్.అగ్రహారానికి చెందిన పాండురంగ ఫిర్యాదు చేశాడు. వీరిద్దరే కాకుండా మరికొంత మంది దగ్గర కంప్యూటర్ ఇనిస్టిస్ట్యూట్ పార్టనర్ షిప్ అంటూ, మరి కొందరికి దొంగ సర్టిఫికెట్‌లు ఇప్పిస్తానని ఇలా రకరకాలుగా మోసగించినట్టు ఆరోపిస్తున్నారు. వీటిపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని సీఐ నాగరాజు తెలిపారు.