జంతువులను చంపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎస్‌కె ఫిరోజ్ హెచ్చరించారు. మొగల్తూరు, కెపి పాలెం సముద్ర తీరప్రాంతంలో మృతి చెందిన కోతులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ దొరికిన కోతులను వేరే ప్రాంతంలో చంపి వేసి ఇక్కడ పడవేసినట్టుగా అనుమానిస్తున్నామని, 1972 జంతు సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేశామని నిందితులను త్వరలో పట్టుకుంటామన్నారు. మూకుమ్మడి కోతులు ఉన్న విషయం తమ దృషికి టీసుకు వస్తే వాటిని పట్టుకుని అడవిలో వదిలి పెడతామన్నారు. పశు వైద్యశాఖ ఏడీ ఏ.సుచ్చరిత మాట్లాడుతూ సుమారు 26 కోతులు మృతి చెందినట్టుగా గుర్తించామని, మృతి చెందిన కోతుల లక్షణాలన్ని ఒకే రకంగా ఉండటంతో రాండమ్‌గా ఐదు కోతులకు మాత్రమే పోస్ట్‌మార్టం నిర్వహించామన్నారు. కోతుల శరీర బాగాలను తీసి అటవీశాఖ అధికారులకు అందచేశామని, వారు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతారని ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్టును బట్టి కోతుల మృతి చెందడానికి గల కారణాలు తెలుస్తాయన్నారు. మృతి చెందిన కోతులన్నిటీని గొయ్యతీసి పూడ్చివేసి వాటికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నీలిమ, డాక్టర్ సురేంద్ర, జిల్లా అటవీ శాఖాదికారి త్రిమూర్తులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.